మానవత్వానికి ప్రాంతీయ భేదం లేదు!!

 

కొంతమంది మనుషులకే ప్రాంతీయ భేదాలు, విభేదాలు వుంటాయిగానీ మానవత్వానికి కాదు. అవును... మానవత్వానికి ప్రాంతీయ భేదం లేదు. ఈ విషయం మరోసారి రుజువైంది. మానవత్వం మీద మనిషికి ఉన్న నమ్మకాన్ని మరింత పెరిగింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన జిల్లా అయిన మెదక్‌ జిల్లాలోని మాసాయిపేట దగ్గర జరిగిన స్కూలు బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో 16 మంది చిన్నారులు మరణించగా, 20 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడిన సంఘటన అందర్నీ కదిలించింది. ఈ సంఘటనపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతోంది. శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ అంతటా విద్యార్థులు మాసాయిపేట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ క్యాండిల్స్.తో శాంతి ప్రదర్శనలు నిర్వహించారు. గాయపడిన చిన్నారులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ మానవత్వం విషయంలో మాత్రం తమకు ప్రాంతీయ భేదాలు లేవని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు నిరూపించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభేదాలను పెంచి పోషించడానికి కంకణం కట్టుకున్న కొంతమంది రాజకీయ నాయకులు ఈ చిన్నారులలోని మానవత్వాన్ని చూసయినా బుద్ధి తెచ్చుకోవాలి.