'ది కశ్మీర్ ఫైల్స్'.. జస్ట్ సినిమా కాదు.. అంతకుమించి...
Published on: Wed Mar 16, 2022 2:45PM
ఒక సినిమా గురించి దేశ ప్రధాని మాట్లడడం చాలా అరుదైన విషయం. నిజానికి ఈరోజు ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే కాదు ప్రతి ఒక్క ‘భారతీయుడు’ మాట్లాడుతున్నారు. ఒక్క భారత దేశంలోనే కాదు, అమెరికా సహా అనేక ప్రపంచ దేశాలలో ‘ది కశ్మీర్ ఫైల్స్’ఫై చర్చ జరుగుతోంది. ప్రపంచ రాజకీయ,దౌత్య వర్గాల్లోనూ కశ్మీర్ విషయంలో కొత్త దృక్పథం, కొత్త ఆలోచనలకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా అంకురార్పణ చేసిందంటే అది అతిశయోక్తి కాదు. చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి అన్నట్లుగా ఈ సినిమా రానున్న సంవత్సరాలలో దౌత్య పరంగా భారత దేశ కీర్తిని, మరింతగా ఇనుమడింప చేస్తుంది, సందేహం లేదు. అందుకే, థియేటర్’లో సినిమాలు చూడడం మరిచి పోయిన వారు కూడా థియేటర్’లకు వస్తున్నారు. సినిమా చూస్తున్నారు. కన్నీళ్లతో , బరువైన గుండెతో వెళుతున్నారు.
అయితే, జాతీయంగా, అంతర్జాతీయంగా ఇంతగా ప్రసంశలు అందుకుంటున్న ఈ సినిమాను దేశంలో కొందరు రాజకీయ కోణంలో చూసి విమర్శలు చేస్తున్నారు. అంతే కాదు, ఈ సినిమా ప్రదర్శనను ఆపాలని, ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి రెండు వర్గాల మధ్య విద్వేషం సృష్టిస్తాయనే, విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాకు అనేక రూపాల్లో వ్యతిరేకత కూడా ఎదురవుతోంది. అయితే, ఒకటి మాత్రం నిజం, ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ, ఒక కన్నీటి చుక్కను రాల్చకుండా, ధియేటర్ నుంచి బయటకు రావడం లేదు. నిజం, సినిమా చూసి బయటకు వస్తున్న వారి ముఖాలను పరీక్షగా చూస్తే ప్రతి ఒక్క ముఖంలో విషాదమే కనిపిస్తోంది. అంటే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా కదిల్చి వేసిందో వేరే చెప్పనక్కర లేదు.
అదలా ఉంటే, కథా పరంగానే కాదు, చిత్రీకరణ పరంగా 24 ఫ్రేమ్స్ చట్రంలో చూసినా, ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి ప్రతి ప్రేక్షకు ఐదుకు ఐదు రేటింగ్స్ ఇస్తునారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, అడక్కుండానే, వినోద పన్ను రాయితీలు ఇస్తున్నాయి. నిజానికి, ‘ది కశ్మీర్ ఫైల్స్’ఒక సినిమా కాదు ప్రేక్షకులను ఊహాలోకలో విహరిప చేసే, సాధారణ చిత్రం కాదు. నిజానికి అదొక కథ కాదు, సాముహిక వ్యథ. ఈసినిమాలో ఎక్కాడా, బాహుబలి కమర్షియల్ సెట్టింగ్స్ కపించవు. మూడు దశాబ్ధాల క్రితం కశ్మీర్’లోయలో కశ్మీర్’ పండిట్స్’ మనందరి కళ్ళముందు అనుభవించిన ఒక అమానుష, అమానవీయ వ్యథ. ఒక వర్గం ప్రజల పై మరో మరోవర్గం సాగించిన దారుణ మారణ కాండే, చిత్రం కథ.
‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా కథ విషయానికి వస్తే, 1980-90లలో కశ్మీర్ పండిట్‌లపై సాగిన సామూహిక హత్యాకాండని తెలుపుతుంది. కశ్మీర్ లోని హిందువులపై పాకిస్తాన్, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు సాగించిన దారుణ మారణ కాండకు పాల్పడ్డారు. కశ్మీర్ పండిట్లను విచక్షణ రహితంగా చంపేశారు, ఆడవారిని మానభంగాలు చేసారు, చిన్న పిల్లలని కూడా చూడకుండా చంపేశారు. కశ్మీర్ ని స్మశానంగా మార్చారు. కశ్మీర్’లో ఉండాలంటే మతం మారాలని,లేదంటే ఊరు వదిలి పోవాలని, కాదంటే చంపేస్తామని బెదిరించారు. అడ్డుకున్న వారిని చంపేసి వారి ఆస్తులను దోచుకున్నారు.ఈ మరణకాండలో ఎందరో హిందువులు చనిపోయారు. సుమారు మరో 5 లక్షల మంది కశ్మీరీ పండిట్‌లు భయపడి వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు. వేలాది కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి. గుడిసెల్లో, గుడారాల్లో ,తలదాచుకుంటున్నారు. అవును, ఈ రోజుకు కూడా అదే పరిస్థితి. ఇదంతా చరిత్ర. ఇదే చిత్ర కథ.
ఇలాంటి నిజాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పాలంటే, సినిమా రూపంలో తెరకెక్కించాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ చరిత్రని ‘ది కశ్మీర్ ఫైల్స్’ రూపంలో ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఉన్న నిజాలని నిక్కచ్చిగా చూపించారు. ఈ సినిమా మొదలైన దగ్గర్నుంచి చిత్ర యూనిట్ కి బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేస్తామని బెదిరించారు. డబ్బులు ఆశ చూపి సినిమాని ఆపేయమని కూడా ప్రయత్నించారు. ఓ వర్గం మత పెద్దలు ఈ చరిత్ర బయటకి రావొద్దని హెచ్చరించారు. కేసులు కూడా వేశారు. అయినా డైరెక్టర్, నిర్మాతలు, చిత్ర యూనిట్ ఎక్కడా భయపడకుండా సినిమాని తెరకెక్కించారు. అందుకే, సినిమా చూసినవారిలో కొందరు, కన్నీళ్ళ పర్యంతం అవుతున్నారు. నిజానికి ఆనాటి మారణకాండకు ప్రత్యక్ష్య సాక్షులుగా, ఆ బాధను 30 ఏళ్లుగా గుండెల్లో మోస్తున్న అనేక మంది వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. విలపిస్తున్నారు.
ఇక చిత్రంలో నటించిన నటీనటుల విషయానికి వస్తే, నటీనటులు ఎవరూ నటించ లేదు. ఎవరి పాత్రలో వారు జీవించారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఆ నిర్జీవ పాత్రలే పాత్రదారులను ఆవహించాయి, అన్నట్లు నటీ నటులు నటించారు. దగాపడిన కశ్మీర్’ పండిట్’గా నటించిన అనుపం ఖేర్ అనుభవం ఉన్ననటుడు. అంతే కాకుండా,కశ్మీర్, వ్యధలకు ప్రత్యక్ష సాక్షి, సో ..సహాజంగానే ఆయన అద్భుతంగా నటించారు. కానీ, నవతరం ప్రతినిధిగా ‘కృష్ణ’ పాత్రను పోషించిన, అంతగా ఎవరికీ తెలియని నటుడు దర్శన్ కుమార్, అంతకంటే అద్భుతంగా నటించారు. ముఖ్యంగా సినిమాకు పతాక సన్నివేశాలలో ‘దర్శన్’ నటనని దర్శించ వలసిందే కాని, మాటలలో వర్ణించడం అయ్యేపనికాదు. అలాగే, ప్రొఫెసర్ పాత్రలో పల్లవీ జోషి, ఒకరని కాదు, ప్రతి నటుడు.అద్భుతంగా తమ ప్రతిభను చూపారు. ఇక దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి గురించి అయితే, ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసింది మిగిలే ఉంటుంది. ప్రతి ఫ్రేమ్’లో దర్శకుని ప్రతిభ దర్శనమిస్తుంది. అందుకే ఒకసారి కాదు, ఎన్ని సార్లు వీలయితే అన్ని సార్లు అందరూ చూడవలసిన సినిమా.. ‘ది కశ్మీర్ ఫైల్స్’.


