థానే తుఫాను బీభత్సం 3జిల్లాలు అతలాకుతలం
Published on: Fri Dec 30, 2011 10:29AM
ఒంగో
లు: థానే తుపాను ప్రభావానికి ప్రకాశం జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కొత్తపట్నం సముద్రతీరంలో 15 అడుగుల మేర అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం గంటగంటకూ ముందుకు రావడంతో.. తీరప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
మరో వైపు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలితీవ్రత పెరిగింది. ఈదురుగాలులు, చలితీవ్రతకు తీరప్రాంత వాసులు వణికిపోతున్నాయి. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా.. అధికారులు పనరావాస చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో థానే తుపాను బీభత్సం సృష్టించింది. సముద్రం 200మీటర్లు ముందుకు చొచ్చుకొచ్చింది. తీరం వెంబడి అలలు విరుచుకుపడ్డాయి. ఐదు మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడటంతో.. లక్షలాది రూపాయల విలువైన కొబ్బరి చెట్లు కడలిలో కలిసిపోయాయి.
అంతర్వేది బీచ్ రోడ్డు ధ్వంసమైంది. తీరప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారం క్రితం సముద్రంలోకి వెళ్లిన కాకినాడకు చెందిన మూడు బోట్లు సురక్షితంగా అంతర్వేది పర్లిపాలెం ఒడ్డుకు చేరాయి.
థానే తుపాన్ పశ్చిమగోదావరి జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. మొగల్తూరు, నర్సాపురం మండలాల్లోని తీరప్రాంతంలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. పెద్దమైనవానిలంక ప్రాంతంలో సముద్రం 50మీటర్లు ముందుకు చొచ్చుకురావడంతో తీరప్రాంతం కోతకు గురైంది.
పేరుపాలెం, కె.పి.పాలెం, బియ్యపుదిబ్బలోనూ తీరప్రాంతం కోతకు గురైంది. సముద్రంలోకి వెళ్లిన నెల్లూరు, కృష్ణపట్నం, విశాఖపట్నం, కాకినాడకు చెందిన 500 మంది మత్స్యకారులు తుపాను హెచ్చరికల నేపథ్యంలో నర్సాపురం ఒడ్డుకు చేరుకున్నారు.


