మృత్యుభయంలో జగన్!
Published on: Tue Jun 25, 2024 12:34PM
అనేక మానసిక సమస్యల పుట్ట మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. ఆయన తన మానసిక సమస్యలకు లండన్‌లో చికిత్స తీసుకుంటున్నారని, లండన్ నుంచి తెప్పించుకుంటున్న మందులు వాడుతున్నారని చెబుతూ వుంటారు. ఆయన మానసిక ఆరోగ్యంపై స్వయానా ఆయన చెల్లెలు షర్మిలారెడ్డి కూడా అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జగన్‌కి ఉన్న అతి పెద్ద మానసిక వ్యాధి ‘నార్సిజం’ అని ఇప్పటికే అనేకమంది మానసిక నిపుణులు ఒక నిర్ణయానికి వచ్చారు. నేనే అందరికంటే ఉన్నత స్థానంలో వుండాలని, అందరూ తన కాళ్ళకిందే పడి వుండాలనేది నార్సిజంలో వున్న ప్రధాన లక్షణం. సరే, ఇప్పుడు జగన్ అధికారం ఎలాగూ పోయింది కాబట్టి, నార్సిజం కూడా కాలక్రమేణా అదుపులోకి వచ్చే అవకాశం వుంది. అయితే, జగన్ చాలా ప్రమాదకరమైన థనాటోఫోబియా (Thanatophobia) అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. తనను ఎవరో చంపేయడానికి కుట్ర చేస్తున్నారని నిరంతరం భయపడుతూ బతకడమే ఈ థనాటోఫోబియా (Thanatophobia) ప్రధాన లక్షణం. ఈ వ్యాధి తన మనసు మీద పడిన ముద్రల కారణంగా కొంతమందిలో ఏర్పడుతుందని అంటున్నారు.
జగన్ ఈ మానసిక వ్యాధి బారిన పడటానికి దారితీసిన పరిస్థితులను గమనిస్తే, జగన్ తాత రాజారెడ్డి పులివెందుల ప్రాంతంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వుండేవారు. కరడుగట్టిన ఫ్యాక్షనిస్టు అయిన ఆయన్ని ఫ్యాక్షనిజమే బలి తీసుకుంది. ప్రత్యర్థులు రాజారెడ్డిని దారుణంగా హత్య చేశారు. ఈ హత్య జరిగిన సమయంలో జగన్ చాలా చిన్న కుర్రాడు. తాతయ్యతో చాలా సన్నిహితంగా వుండే జగన్ మనసు మీద ఆ హత్య ముద్ర బాగా పడింది. ఆ తర్వాత జగన్ మనసు మీద పడిన మరో ముద్ర... తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం. రాజశేఖరరెడ్డిది ప్రమాదవశాత్తూ జరిగిన మరణమే అని విచారణలో తేలినప్పటికీ, తన తండ్రిని ఎవరో హత్య చేశారనే జగన్ భావిస్తూ వుంటారు. వైఎస్సార్ మరణం సందర్భంగా కూడా తన తండ్రిది హత్యేనని ఆయన ఆరోపిస్తూ వచ్చారు. సరే, సమాజం ఏమని తీర్మానించినప్పటికీ, జగన్ దృష్టిలో మాత్రం తన తండ్రిది ముమ్మటికీ హత్యే. ఇలా వైఎస్సార్ మరణం కూడా జగన్ మనసు మీద ఎక్కువగానే ప్రభావం చూపించింది. ఇద్దరు తన ఆత్మీయులు అసహజ మరణానికి గురికావడంతో జగన్‌లో థనాటోఫోబియా (Thanatophobia) ప్రారంభమై వుండొచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. తాను కూడా తన పెద్దల తరహాలోనే హత్యకు గురవుతాననే భయం ఆయనలో క్రమేపీ పెరుగుతూ వచ్చిందని భావిస్తున్నారు. తాత, తండ్రి మరణాలే జగన్ మనసు మీద ప్రభావం చూపిస్తున్నాయని అనుకుంటే, ఇంతలోనే జగన్ ప్రాణపదంగా భావించే ఆయన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని ‘ఎవరో’ హత్య చేయించారు. గిట్టనివాళ్ళు అది జగన్ డైరెక్షన్లో జరిగిన మర్డరేనని అంటూ వుంటారుగానీ, నేరం బయటపడేంత వరకు మనం ఎవర్నీ నిందించకూడదు. ఆ విధంగా తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తి... తమ కుటుంబానికి పెద్ద అయిన వివేకానందరెడ్డి హత్య కూడా జగన్ మనసుకు తీరని గాయం చేసి వుంటుందని, దాంతో ఆయనలో వున్న థనాటోఫోబియా (Thanatophobia) మరింత పెరిగి మానసిక నిపుణులు భావిస్తున్నారు. ఈ ఘటనల ఫలితంగానే జగన్ ప్రాణభయంతో బతుకుతున్నారని చెబుతున్నారు.
జగన్ ఈ మృత్యుభయంతోనే నిరంతరం అభద్రతా భావంతో బతుకుతూ వుంటారు. బెంగళూరులో వున్న జగన్ ప్యాలెస్‌కి భద్రత మామూలుగా వుండదు.. ఇక హైదరాబాద్ లోటస్ పాండ్ ప్యాలెస్ భద్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాడేపల్లి ప్యాలెస్ భద్రత అయితే మరీ పరాకాష్ట. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ మొత్తం 48 చోట్ల చెక్‌పోస్టులు జగన్ ఏర్పాటు చేసుకున్నారు. జగన్ అధికారంలో వున్నంతకాలం మొత్తం 934 మందితో భద్రత ఏర్పాటు చేసుకున్నారు. అమెరికా ప్రెసిడెంట్‌కి కూడా ఇంతమందితో భద్రత ఉంటుందా అంటే డౌటే... జగన్ ఇండియాలో ఉన్నప్పుడే కాదు.. ఈయనని ఎవరూ గుర్తుపట్టని విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా భారీగా భద్రతా ఏర్పాట్లు చేసుకుంటారు. జగన్ అధికారంలో వున్నంతకాలం ఈయన భద్రతకే వేల కోట్ల రూపాయలు ఖర్చయింది. ముఖ్యమంత్రి పదవిలోంచి దిగిపోయిన తర్వాత కూడా ప్రభుత్వ ఖర్చుతో అదే భద్రత కొనసాగుతోంది. ఇలాంటి భారీ భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సమీక్షిస్తోంది. ఏది ఏమైనప్పటికీ, జగన్ తన మానసిక సమస్యల నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడాలని ఆశిద్దాం.


