ఎవండోయ్ ఇది విన్నారా..పిల్లికి నోటీసులంట

పిల్లికి నోటీసులు ఇచ్చిన విచిత్రమైన సంఘటన హోస్టన్‌లో జరిగింది. బ్రౌజర్‌గా అందరి అభిమానాన్ని అందుకున్న ఆ పిల్లి టెక్సాస్‌లోని వైట్ సెటిల్‌మెంట్ పబ్లిక్ లైబ్రరీలో ఆరేళ్లుగా ఉంటోంది. అయితే దాని వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చిన్నారులు పిటిషన్ వేశారు. ఓటర్లు కూడా వివిధ సందర్భాల్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దానిని అక్కడ నుంచి పంపించి వేయాలని టెక్సాస్ సిటీ కౌన్సిల్ ఓటింగ్ నిర్వహించింది. ఆ పిల్లిని అక్కడి నుంచి మరో చోటికి పంపించి వేయాల్సిందిగా ఎక్కువమంది ఓటు వేశారు. దీంతో నెల రోజుల్లో లైబ్రరీ ఖాళీ చేయాల్సిందిగా కౌన్సిల్ బ్రౌజర్‌కు నోటీసులు పంపింది. సిటీ హాల్, సిటీ బిజినెస్ జంతువులకు నివాస స్థలాలు కావని కౌన్సిల్ మెంబర్ ఎల్జీ క్లెమెంట్ పేర్కొంటూ పిల్లి లైబ్రరీని ఖాళీ చేయక తప్పదని పేర్కొన్నారు. అయితే బ్రౌజర్ వల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేవని, అందరూ దానిని ఇష్టపడతారని వైట్ సెటిల్‌మెంట్ పబ్లిక్ లైబ్రరీ ఫ్రెండ్స్ అంటున్నారు.