ఆత్మకూరు బైపోల్ లో టెన్షన్ టెన్షన్
Published on: Thu Jun 23, 2022 1:06PM
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. నియోజకవర్గం వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ ఆత్మకూరు మండలం బట్టేపాడు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓటు వేసేందుకు ఎన్నికల కేంద్రంలోకి వచ్చిన ఓటర్లను కొందరు ప్రలోభపెడ్తుండటంతో అక్కడే ఉన్న స్వతంత్ర అభ్యర్ది తూమాటి శశిధర్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం స్వతంత్ర అభ్యర్థినే నిలువరించే ప్రయత్నం చేయడం గమనార్హం.
దీంతో పోలీసులు- శశిధర్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని స్వతంత్ర అభ్యర్ది శశిధర్ రెడ్డి ఆరోపించారు. స్వతంత్ర అభ్యర్థి తూమాటి శశిధర్ రెడ్డి ప్రస్తుతం టీడీపీలో ఎంపీటీసీగా కొనసాగుతున్నారు.
కాగా.. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరు స్థానంలో ఉప ఎన్నిక అనివార్యం అయింది. అధికార వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్ బరిలో నిలిచారు. సిటింగ్ ఎమ్మెల్యే మరణించిన కారణంగా ఉప ఎన్నిక జరిగితే.. పోటీ పెట్టకూడదనే తన సిద్ధాంతం ప్రకారం టీడీపీ ఎవరినీ బరిలో దింపలేదు. ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో మొత్తం 14 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.


