TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజు వెడలే..

Published on: Wed Mar 12, 2025 7:23AM

సోము  కోసం గాల్లోకి లేచిన రెండు విమానాలు
బాలయోగి ఎపిసోడును తలపించిన సోము వీర్రాజు నామినేషన్ ఘట్టం

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఘట్టంలో సంచలనమైన ఎపిసోడ్ నడిచింది. బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు నామినేషన్ వేసేందుకు చివరి నిమిషం వరకూ టెన్షన్ వాతావరణమే నడిచింది. ఆయనకు బీ-ఫారం ఇచ్చేందుకు రెండు విమానాలు గాల్లోకి లేచాయంటే ఎంతటి టెన్షన్ రేగిందో అర్థం చేసుకోవచ్చు. బీ-ఫారం కోసం ఒక విమానం.. బీ-ఫారం మీద సంతకం చేసే పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి కోసం మరో విమానం ఆఘమేఘాల మీద మేఘాల్లో తేలుకుంటూ విజయవాడకు చేరుకున్నాయి. ఇక ఏ మాత్రం ఆలస్యమైనా నేరుగా  హెలీకాప్టరులో అసెంబ్లీ సమీపంలో దిగేందుకు కూడా ఏర్పాట్లు చేశారంటే సోము వీర్రాజు నామినేషన్ ఎపిసోడు ఎంతటి టెన్షన్ పుట్టించిందో అర్థం చేసుకోవచ్చు.

 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానం కోసం సోము వీర్రాజు అభ్యర్థిత్వం చివరి నిమిషంలో ఖరారు అయినట్లు తేలింది. బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి  పార్లమెంటు సమావేశాల కోసం సోమవారం ఉదయమే ఢిల్లీ బయలుదేరి వెళ్ళిపోయారు. విచిత్రంగా సోము వీర్రాజు నామినేషన్‌ వెయ్యడానికి ఏపీ స్టేట్‌ బీజేపీ ఆఫీసులో బీ ఫారాలు నిండుకున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యాలయ బాధ్యులు బీ ఫారాలు లేవని తెలియజేశారు. ఈ పరిణామాలన్నింటినీ కేంద్ర నాయకత్వానికి ఒకరిద్దరు సీనియర్‌ నాయకులు వివరించడంతో వెంటనే అధిష్టానం ఆదేశాలతో ఢిల్లీ నుంచి స్పెషల్‌ ఫ్లైట్లోలో దగ్గుబాటి పురంధేశ్వరి బీఫారమ్ పై సంతకం చెయ్యడానికి, సోము వీర్రాజు నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడ తిరుగు ప్రయాణం అయ్యారు. అదే సమయంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి బీ ఫామ్‌ తీసుకుని విజయవాడకు మరో స్పెషల్‌ ఫ్లైట్‌ బయలుదేరింది. గన్నవరం నుంచి బీ-ఫారంతో ఓ విమానం.. ఆ బీ-ఫారంపై సంతకం పెట్టడానికి పురందేశ్వరి ఢిల్లీ నుంచి మరో ఫ్లైటులో ఢిల్లీ నుంచి విజయవాడకు ప్రత్యేక విమానాల్లో చేరుకున్నారు.

పురంధేశ్వరి రావడం ఆలస్యమైతే.. బీ-ఫారం మీద సంతకం పెట్టే అధికారం బీజేపీ సీనియర్ నేత కాశీరాజుకు అప్పజెప్పింది  అధినాయకత్వం. దీంతో కొంత టెన్షన్ తగ్గినా.. అధ్యక్షురాలు లేకుండా నామినేషన్ వేయడం సరికాదనే భావనతో ఢిల్లీ నుంచి పురంధేశ్వరి హుటా హుటిన వచ్చారు. పురందేశ్వరి వచ్చేలోగానే కాశీరాజు సంతకం చేసిన బీ ఫారంపై నామినేషన్ వేసేందుకు సిద్దమవుతుండగా.. ఢిల్లీ నుంచి పురందేశ్వరి చేరుకున్నారు. దీంతో సోమవారం మధ్యాహ్నం 2.46గంటలకు అంటే నామినేషన్ల గడువు మరో 14 నిమిషాల్లో ముగుస్తుందనగా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం నామినేషన్‌ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు సోము వీర్రాజును అభినందిస్తూ… మీ ఢిల్లీ పెద్దలు నీ పేరు చెప్పబట్టే నేను బీజేపీకి ఎమ్మెల్సీ సీటు ఇచ్చానని, లేకపోతే ఇప్పుడు పార్టీలో ఉన్న ఒత్తిడికి ఇచ్చే వాడిని కాదని   అనడం ట్విస్ట్. చంద్రబాబు ఈ కామెంట్ చేయడం ద్వారా సోము వీర్రాజును సున్నితంగా హెచ్చరించారనే చర్చ జరుగుతోంది.