TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

గృహ నిర్బంధంలో జేసీ బ్రదర్స్... తాడిపత్రిలో హైటెన్షన్  

Published on: Mon Jan 4, 2021 11:18AM

అనంత‌పురం జిల్లా తాడిప‌త్రిలో జేసీ బ్ర‌ద‌ర్స్ నిర‌హార దీక్ష చేసేందుకు సిద్ధం కావడంతో హై టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. త‌మ‌పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్ట‌డాన్ని నిర‌సిస్తూ.. దీనికి వ్య‌తిరేకంగా త‌హ‌సిల్దార్ కార్యాల‌యం ఎదుట ఆమ‌ర‌ణ నిర‌హార దీక్ష చేసేందుకు జేసీ సోదరులు సిద్ధ‌మయ్యారు. దీంతో ముందస్తు చ‌ర్య‌ల్లో భాగంగా జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, జేసీ దివాక‌ర్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నిరాహార దీక్ష చేయడానికి బయల్దేరిన జేసీ దివాక‌ర్ రెడ్డిని పోలీసులు ఫామ్ హౌజ్ వ‌ద్ద‌నే హౌస్ అరెస్ట్ చేయ‌గా.. ప్ర‌భాక‌ర్ రెడ్డిని ఇంటి వ‌ద్దే అడ్డుకున్నారు. దీంతో అయన ఇంటి వద్దే ఆమరణ దీక్షకు కూర్చున్నారు. దీంతో అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. మరోపక్క జేసీ బ్ర‌ద‌ర్స్ అనుచ‌రులు, టీడీపీ కార్య‌క‌ర్తలు వారి ఇళ్ల వ‌ద్ద‌కు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తున్నారు.

 

ఇదిఇలా ఉండగా ఇప్ప‌టికే పోలీసులు తాడిప‌త్రిలో 30 యాక్టు,144 సెక్షన్ విధించారు. ప్రస్తుతం ప‌ట్ట‌ణంలో ఎలాంటి స‌భ‌లు, స‌మావేశాలు, ధ‌ర్నా కార్య‌క్ర‌మాల‌కు అనుమ‌తి లేద‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. జేసీ సోదరులతో పాటు ఎమ్మెల్యే పెద్దారెడ్డి నివాసాల వ‌ద్ద పోలీసులు భారీగా బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. మరోపక్క పోలీసులు తమను అరెస్ట్‌ చేసినా.. దీక్ష చేసి తీరతామని జేసీ బ్రదర్స్ స్పష్టం చేస్తున్నారు. తాడిపత్రిలో పోలీసులు కవాతు చేసినా తాము భయపడేది లేదంటున్నారు. తాము శాంతియుతంగానే ఆమ‌ర‌ణ‌ నిరాహార దీక్ష చేస్తామ‌ని.. దీనిని పోలీసులు అడ్డుకోవ‌డం స‌రికాదంటూ జేసీ బ్రదర్స్ మండిప‌డుతున్నారు.