శివారులో బీజేపీ జోష్! గులాబీలో పెరిగిన టెన్షన్? 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తుది లెక్కలు వచ్చాయి. పోలింగ్ శాతం తగ్గిందని మొదట భావించినా.. ఎన్నికల సంఘం ఇచ్చిన ఫైనల్ లెక్కలతో గతంలో కంటే పోలింగ్ శాతం పెరిగినట్లు తేలింది. ఓటింగ్  శాతం తగ్గితే అధికార పార్టీకి ప్లస్ అవుతుందని అంచనా వేశారు. అయితే ఫైనల్ లెక్కల్లో గతంలో కంటే ఓటింగ్ శాతం పెరగడంతో బీజేపీలో సంతోషం వ్యక్తమవుతోందని తెలుస్తోంది. పోలింగ్ సరళిని అంచనా వేసిన కమలం నేతలు 70 నుంచి 75 డివిజన్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారట. పోలింగ్ సరళి అధికార పార్టీలో గుబులు రేపుతుందని చెబుతున్నారు. అందుకే పోలింగ్ పై టీఆర్ఎస్ నేతలెవరు మాట్లాడటం లేదని భావిస్తున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే తెలంగాణ బీజేపీ చీఫ్ సంజయ్ తో పాటు ముఖ్య నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. కాని అధికార పార్టీ లీడర్లు మాత్రం బయటికి రాలేదు.

 

జీహెచ్ఎంసీపై మరోసారి జెండా ఎగురవేయడం ఖాయమని టీఆర్ఎస్ నేతలు పైకి చెబుతున్నా.. అంతర్గతంగా మాత్రం టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా భారీగా సైలెంట్ ఓటింగ్ జరిగిందనే అంచనాకు గులాబీ నేతలు వచ్చారంటున్నారు. ముఖ్యంగా యూత్ ఓట్లన్ని వన్ సైడ్ గా కమలానికి పడినట్లు చెబుతున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా బీజేపీ నేతల హంగామానే కనిపించిందని.. వివిధ సర్వే సంస్థలు కూడా చెబుతున్నాయి. ఈ లెక్కన గ్రేటర్ శివారు ప్రాంతాల్లో బీజేపీకి పోలింగ్  వన్ సైడ్ గా జరిగిందని టీఆర్ఎస్ పెద్దలు అంచనా వేస్తున్నారట. ఎల్బీనగర్ నియోజకవర్గంలో 11 డివిజన్లు ఉండగా..అక్కడ బీజేపీ క్లీన్ స్వీప్ చేయవచ్చంటున్నారు. ఇక్కడ అంతా సిట్టింగులకే టికెట్లు ఇచ్చింది గులాబీ పార్టీ. వారిపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంటున్నారు. సిట్టింగులపై వ్యతిరేకతకు బీజేపీ జోష్ కూడా తోడవడంతో ఎల్బీనగర్ లో కారు పూర్తిగా ఫల్టీ కొట్టిందనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ నేతలు కూడా ఎల్బీనగర్ పై ఆశలు వదులుకున్నారని చెబుతున్నారు. 

 

ఉప్పల్, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లోనూ బీజేపీ హవా కనిపించిందని చెబుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందని భావించినా.. పోలింగ్ సమయానికి వాళ్లు హ్యాండ్సప్ అన్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ వీక్ కావడం బీజేపీకి మరింత కలిసి వచ్చిందంటున్నారు. కాంగ్రెస్ కు ఓట్లు మరింత తగ్గితే ఇక్కడ కూడా బీజేపీకి వన్ సైడ్ ఫలితాలు రావచ్చంటున్నారు. కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, శేరిలింగం పల్లి నియోజకవర్గాల్లోనూ బీజేపీకి ఓటర్ల నుంచి మద్దతు లభించిందని తెలుస్తోంది. కూకట్ పల్లి నియోజకవర్గంలో కొన్ని డివిజన్లు, శేరిలింగం పల్లిలో కొన్ని డివిజన్లు మాత్రమే కచ్చితంగా గెలుస్తామని, మిగిలిన డివిజన్లలో పోటీ తీవ్రంగా ఉందని టీఆర్ఎస్ నేతలే చెబుతున్నారట. గ్రేటర్ డివిజన్లకు సంబంధించి.. శివారు ప్రాంతంలోనే దాదాపు 50 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడంతా బీజేపీ గాలి వీచిందన్న ప్రచారం ఇప్పుడు అధికార పార్టీ నేతలను కలవరపెడుతుందని తెలుస్తోంది. నియోజకవర్గాలు, డివిజన్ల  నుంచి పార్టీ నేతలు ఇస్తున్న వివరాలు కూడా టీఆర్ఎస్ నేతల ఆందోళనను పెంచుతున్నాయట. 

 

నిజానికి హైదరాబాద్ కోర్ సిటిలో బీజేపీకి మొదటి నుంచి పట్టుంది. అక్కడ బీజేపీ ఎక్కువ డివిజన్లు గెలుస్తుందని, శివారులో కారుకు ఎక్కువ రావచ్చని మొదట అంచనా వేశారు. కాని పోలింగులో మాత్రం సీన్ రివర్స్ అయినట్లు తెలుస్తోంది. గ్రేటర్ శివారు ప్రాంతాల్లో కమలం వికసించినట్లు కనిపించగా.. కోర్ సిటీలో మాత్రం టీఆర్ఎస్ కు అనుకూలంగా వాతావరణం కనిపించింది. కోర్ సిటిలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటం... వారంతా కారుకు అనుకూలంగా ఓటేయడం అధికార పార్టీకి ప్లస్ కావచ్చంటున్నారు. ప్రచారంలో నేతల రెచ్చగొట్టే ప్రసంగాలు కూడా కోర్ సిటిలో ప్రభావం చూపాయంటున్నారు. గొడవలు జరుగుతాయనే భయంతో కొంత మంది ఓటర్లు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారని లెక్కలు వేస్తున్నారు. అందుకే ఖైరతాబాద్, జూబ్లిహిల్స్, ముషిరాబాద్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలవచ్చంటున్నారు. సికింద్రాబాద్, అంబర్ పేట నియోజకవర్గాల్లో గట్టి పోటీ జరిగిందంటున్నారు.

 

పాతబస్తిలో మాత్రం మళ్లీ ఎంఐఎం తన పట్టు నిలుపుకుంటుందని భావిస్తున్నారు.గతంలో పతంగి పార్టీ 44 డివిజన్లు గెలిచింది. ఇప్పుడు కూడా 40కి అటు ఇటూగా ఎంఐఎం గెలవచ్చంటున్నారు. పోలింగ్ చివరి గంటల్లో ఎంఐఎంకు అనుకూలంగా పోలింగ్ జరిగిదంటున్నారు. నిజానికి ఎంఐఎంకు గతంలో ఎప్పుడు లేనంత వ్యతిరేకత ఓల్డ్ సిటిలో కనిపించింది. అయితే పోలింగ్ రోజున మాత్రం అది పెద్దగా ప్రభావం చూపలేదంటున్నారు. ఇతర పార్టీలు పాతబస్తిలో పెద్దగా ప్రచారం చేయకపోవడం కూడా ఇందుకు కారణమంటున్నారు. ప్రచారంలో జరిగిన పరిణామాలతో ముస్లింలలో మళ్లీ యూనిటి కనిపించగా.. కొన్ని వర్గాల ప్రజలు ఓటింగ్ కు రాలేదంటున్నారు. గోషామహాల్ నియోజకవర్గంలో మార్వాడి, గుజరాతీలు కూడా ఎక్కువగా పోలింగులో పాల్గొనలేదని చెబుతున్నారు. ఇవి కూడా పతంగి పార్టీకి కలిసి రావచ్చని చెబుతున్నారు. ఓల్డ్ సిటీలో బీజేపీ, టీఆర్ఎస్ కు రెండు,మూడు సీట్లకు మించి రాకపోవచ్చంటున్నారు.

 

మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ సరళి గులాబీ పార్టీ నేతల్లో గుబులు పెంచుతుందని చెబుతున్నారు. శివారు ప్రాంతంలో తమకు భారీగా నష్టం జరిగిందని, కోర్ సిటిపైనే ఆశలు పెట్టుకున్నామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారట. పోలింగ్ చివరి గంటల్లో జరిగిన ఓటింగ్ పైనా కొంత ఆశలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం అందించిన  వరద సాయం అందుకున్న ఓటర్లలో ఎంత మంది తమవైపు నిలిచారోనన్న దాన్ని బట్టే తమ విజయ అవకాశాలు ఉంటాయని అధికార పార్టీ నేతలు నిర్ణయానికి వచ్చారంటున్నారు. గ్రేటర్ పరిధిలోని ప్రతి డివిజన్ లో మూడు నుంచి నాలుగు వేల మందికి వరద సాయంగా 10 వేలు ఇచ్చామని టీఆర్ఎస్ చెబుతోంది. అయితే అందులో ఎంత మొత్తం వరద బాధితులకు వెళ్లింది.. ఎంత వరకు గులాబీ నేతల జేబుల్లోకి వెళ్లిందన్న దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. గ్రేటర్ ఫలితాల్లో అది తేలిపోనుందని చెబుతున్నారు.