ముత్తూట్‌లో గోల్డ్ సేఫేనా? షేర్లు పతనం, మరి, మీ బంగారం?

యజమాని చనిపోతే సంస్థ కుప్పకూలిపోతుందా? ఏమో.. ఏమైనా జరగొచ్చు. కొన్ని సంస్థలు యజమానితో సంబంధం లేకుండా మనుగడ సాగిస్తే.. మరికొన్ని సంస్థలు ఓనర్ తో పాటు కాలగమనంలో కలిసిపోయిన ఘటనలు ఉన్నాయి. మరి, ముత్తూట్ లో ఏం జరుగుతోంది? భవిష్యత్ లో ఏం జరగబోతోంది? ఇదే ప్రశ్న ముత్తూట్ ఫైనాన్స్ లో బంగారం తనఖా పెట్టిన మదుపర్లను ఒత్తిడికి గురి చేస్తోంది. సోమవారం స్టాక్ మార్కెట్లో ముత్తూట్ షేర్లు భారీగా పతనం అవడంతో ఆ భయం మరింత పెరుగుతోంది. 

ఇటీవల ముత్తూట్ గ్రూప్ ఛైర్మన్, హోల్ టైమ్ డైరెక్టర్ ఎంజీ జార్జ్ ముత్తూట్ (71) అనుమానాస్పదంగా మృతిచెందారు. తన నివాసంలో నాలుగో అంతస్తు నుంచి పడి జార్జ్ ముతూట్ చనిపోయారు. పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఢిల్లీ ఎయిమ్స్  ఫోరెన్సిక్ విభాగం ముగ్గురు సీనియర్ వైద్యుల బోర్డును ఏర్పాటు చేసింది. ఈ కేసును వారు అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. 

1993లో జార్జ్ ముత్తూట్‌ గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఆధ్వర్యంలో సంస్థ భారీగా విస్తరించింది. గోల్డ్ లోన్ ఇండస్ట్రీలో మార్కెట్ లీడర్ గా ఎదిగింది. సంస్థ యజమాని మరణంతో ముత్తూట్‌ ఫైనాన్స్‌ లో బంగారం కుదవపెట్టి రుణం తీసుకున్న వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. తాము తనఖా పెట్టిన బంగారం ఎవరి దగ్గర ఉందో? ఆ లెక్కలు ఎవరు చూస్తున్నారో? ఓనర్ లేకపోవడంతో తమ గోల్డ్ తిరిగి వస్తుందో రాదో? సంస్థ మునపటిలా కొనసాగుతుందో లేదో? ఇలా అనేక అనుమానాలు. దాని ఫలితమే.. స్టాక్ మార్కెట్లో ముత్తూట్ ఫైనాన్స్ షేర్ పతనం. ఇక బంగారం తనఖా పెట్టిన వారు సైతం పెద్ద సంఖ్యలో సంస్థ ముందు బారులు తీరారు. కుదవ పెట్టిన బంగారం విడిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో.. సంస్థ గోల్డ్ కస్టమర్ల నుంచి భారీగా ఒత్తిడి ఎదుర్కొంటుంది. ప్రజల్లో భయం మరింత పెరిగితే.. సంస్థ ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ సమయంలో ముత్తూట్ ఫైనాన్స్ తరఫున స్పష్టమైన ప్రకటన గానీ, హామీ గానీ రావాల్సి ఉంది. అప్పటి వరకూ వినియోగదారుల్లో ఆందోళన తప్పకపోవచ్చు.