సవాళ్లు ప్రతి సవాళ్లతో గొల్లపూడిలో హైటెన్షన్.. దేవినేని ఉమా అరెస్ట్  

విజయవాడ నగరంలోని గొల్లపూడి ప్రాంతంలో తీవ్ర‌ ఉద్రిక్త పరిస్థితి నెల‌కొంది. రాష్ట్ర మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమల మధ్య సవాళ్లు‌, ప్రతి సవాళ్ల‌తో ఒక్క‌సారిగా అక్కడ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెలకొంది. దేవినేని ఉమ‌పై విమ‌ర్శ‌లు చేసే సమయంలో ఒక్కసారిగా స‌హ‌నం కోల్పోయిన కొడాలి నాని మాట జారారు. దేవినేని ఉమ‌ను ఏకంగా ఇంటికి వ‌చ్చి తంతా అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో మంత్రి వ్యాఖ్య‌ల‌పై దేవినేని ఉమ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. ఆ వ్యాఖ్యలకు నిర‌స‌న‌గా ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద దీక్షకు సిద్ధ‌మ‌య్యారు. మంత్రి కొడాలి నానికి ద‌మ్ముంటే త‌న‌ను ట‌చ్ చేసి చూడాలంటూ అయన స‌వాల్ విసిరారు.

 

దీంతో ఈరోజు ఉదయం గొల్లపూడిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నిర‌న‌స‌న‌కు సిద్ద‌మైన దేవినేని ఉమను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, టీడీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య తోపులాట జ‌రిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గొల్ల‌పూడిలో ఎటువంటి రాజ‌కీయ కార్య‌క్ర‌మానికి అనుమ‌తి లేద‌న్న పోలీసులు.. దేవినేని ఉమ‌ను బ‌ల‌వంతం‌గా అరెస్టు చేసి.. పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. మ‌రోపక్క దేవినేని ఉమ నిర‌స‌న‌కు సంఘీభావంగా బ‌య‌ల్దేరిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.