గొల్లపూడిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత.. దీక్షకు దిగిన దేవినేని ఉమా 

ఏపీ రాజధాని అమరావతి తరలింపును వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమం ఈరోజుతో 400వ రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుల ఉద్యమానికి మద్దతుగా టీడీపీ దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో గొల్లపూడి సెంటర్ మొత్తం ప్రస్తుతం పోలీసుల వలయంలో ఉంది. రైతు ఉద్యమానికి మద్దతుగా టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తన నివాసంలో దీక్ష చేపట్టారు. దీంతో ఆ సమీపంలోని నివాసం ఉండే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం గొల్లపూడి ప్రాంతం మొత్తం కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది. మరోపక్క దేవినేని దీక్షకు అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. రైతుల దీక్షలకు టీడీపీ నాయకులు దులిపాళ్ల నరేంద్ర తన మద్దతు తెలిపారు.

 

ఇది ఇలా ఉండగా నిన్న కూడా గొల్లపూడిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దేవినేని ఉమ పై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టాలని దేవినేని సిద్ధం కాగా.. ఆయనను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.