ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. పది మంది మావోలు మృతి
Published on: Fri Sep 12, 2025 6:14AM
.webp)
నక్సల్ విముక్త భారత్ లక్ష్యంగా కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ కగార్ కొనసాగుతున్నది. తాజాగా ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మరణించారు. మృతులలో మావోయిస్టు పార్టీ కీలక నేత, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు బాలకృష్ణ అలియాస్ మనోజ్ కూడా ఉన్నారు. గరియాబాద్ జిల్లా అడవులలో మావోయిస్టుల కదలికలపై అందిన స్పష్టమైన సమాచారం మేరకు భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ కూంబింగ్ లో మెయినాపూర్ ప్రాంతంలో నక్సల్స్ తారసపడ్డారు. భద్రతా దళాలను చూసి మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మరణించారు. పలువురు గాయపడి ఉంటారనీ, దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనీ చెబుతున్నారు. సంఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, విప్లవ సాహిత్యాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. కాగా ఈ ఎన్ కౌంటర్ లో మరణించి మోడం బాలకృష్ణది తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా గణపురం..
స్పెషల్ టాస్క్ ఫోర్స్ , కోబ్రా, సీఆర్పీఎఫ్, ఇతర రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందిన సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్ లో భాగంగా ఈ ఎన్ కౌంటర్ జరిగింది. కాగా ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత ఐదు నెలల కాలంలోనే నాలుగువందల మందికి పైగా మావోయిస్టులు ఎన్ కౌంటర్లలో హతమయ్యారు. వీరిలో మావోయిస్టు అగ్రనేతలు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశరావు, కేంద్ర కమిటీ సభ్యులు భాస్కర్, సుధాకర్, చలపతి వంటి వారు కూడా ఉన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో మావో యిస్టులు లొంగిపోయారు.


