మన్యంలో 3 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత.. జాగ్రత్తలివే !
Published on: Mon Jan 31, 2022 1:17PM
విశాఖ ఏజెన్సీని చలి వణికిస్తోంది. గత నాలుగైదు రోజులుగా చలి విపరీతంగా పెరుగుతోంది. తాజాగా మన్యంలో ఉష్ణోగ్రత 3 డిగ్రీలకు పడిపోయింది. డే అంతా కూడా పొగమంచు ఆవరించి విపరీతమైన చలిగా ఉంటోంది. పొగమంచు కారణంగా వాతావరణం అంతా మసకమసకగా తయారై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 3, 4 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులు గానీ, వాహనాలు గానీ కనిపించకపోవడంతో రోడ్ల మీద వెళ్లేందుకు జంకుతున్నారు. లైట్లు వేసినా కూడా పొగమంచు కారణంగా సరిగా గుర్తించలేకపోతున్నట్టు వాహనదారులు చెబుతున్నారు. అయితే వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ వాహనాలు నడపాలని లేకుంటే తగు చర్యలు చేపడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా చలికాలం ప్రారంభం కావడానికి ముందుగానే మన్యంలో చలి మొదలవుతుంది. అయితే ఈ ఏడాది మాత్రం కాస్త ఆలస్యంగానే చలి మొదలైందని అధికారులు అంటున్నారు. వర్షాకాలంలో భారీ వర్షాల కారణంగా చలి ప్రభావం కానరాకపోవడంతో ఈ ఏడాది చలి బారి నుండి తప్పించుకున్నామని మన్యం వాసులు సంతోషించారు. కానీ అనూహ్యంగా డిసెంబరు నెల నుండి ప్రారంభమైన చలి మన్యం వాసులను వణికించేస్తోంది. ఈ మధ్యలో అడపా, దడపా వర్షాలు కురిసినప్పటికి చలి ప్రభావం మాత్రం తగ్గకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా రెండు రోజులనుండి చలి ప్రభావం తీవ్ర రూపం దాల్చింది. దీంతో మన్యం ప్రజలు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మంచు తెరలు కమ్ముకుని వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఉదయాన్నే పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు వివిధ పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
ఇక వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పులతో జ్వరాలు వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అవసరం మేరకు చలి ప్రభావం తగ్గిన తరువాతే దిన చర్యలు ప్రారంభించుకోవాలని సూచిస్తున్నారు.


