TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బెంగాల్‌లో బీజేపీని గెలిపించింది...ఎలక్షన్ కమిషనేనా?

Published on: Thu May 7, 2026 9:07PM

 

తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ఈ చర్చలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. తమిళనాడు రాజకీయాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎంతవరకు ఉంటుందనే ప్రశ్నకు స్పందించిన డోలేంద్ర ప్రసాద్.. “తమిళనాడులో చిన్న భూకంపం వచ్చినా ఏపీలో ప్రకంపనలు కనిపిస్తాయి” అని వ్యాఖ్యానించారు. 

దశాబ్దాలుగా ద్రవిడ రాజకీయాలను శాసించిన డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలకు విజయ్ నేతృత్వంలోని టీవీకే గట్టి సవాల్ విసిరిందన్నారు. తమిళనాడులో జరిగిన ఎన్నికలను “జెన్-జీ ఎలక్షన్స్”గా అభివర్ణిస్తూ, యువ ఓటర్లు భారీగా విజయ్‌కు మద్దతు ఇచ్చారని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే, యాక్సిస్ మై ఇండియా అంచనాలు చాలా వరకు కరెక్ట్‌గా ఉన్నాయని, విజయ్ పార్టీకి 100కు పైగా సీట్లు వచ్చే అవకాశాన్ని ముందుగానే సూచించిందని చెప్పారు. గతంలో తమిళనాడులో కరుణానిధి, జయలలిత మధ్య అధికార మార్పిడి కొనసాగేదని, ఇప్పుడు ఆ రాజకీయ సమీకరణాల్లో మార్పు కనిపిస్తోందన్నారు.

బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా గెలవలేదని, ఎన్నికల కమిషన్ సహకారంతో గెలిచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయని ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ అన్నారు. ముస్లిం ఓట్ల విభజన కారణంగా మమతా బెనర్జీకి నష్టం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మాట్లాడిన డోలేంద్ర ప్రసాద్.. కేసీఆర్ రాజకీయ వారసత్వాన్ని ప్రజలు పూర్తిగా అంగీకరించలేదని, అలాగే చంద్రబాబు తర్వాత నారా లోకేష్‌ను ప్రజలు ఎంతవరకు అంగీకరిస్తారో 2029 ఎన్నికల్లో తేలుతుందని వ్యాఖ్యానించారు. 

అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో లోకేష్ కీలక శక్తిగా ఎదుగుతున్నారని చెప్పారు. గత ఎన్నికల తర్వాత లోకేష్‌లో వచ్చిన పరిణతి, యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లో సంపాదించుకున్న ఆదరణ ఆయనను పార్టీ భవిష్యత్ నాయకుడిగా నిలబెడుతోందన్నారు. చంద్రబాబు నాయుడు తన రాజకీయ అనుభవంతో లోకేష్‌ను వ్యూహాత్మకంగా ముందుకు నడిపిస్తున్నారని అభిప్రాయపడ్డారు. బెంగాల్‌,  తమిళనాడు ఎన్నికల ఫలితాలపై  వివరాలు కంఠంనేని రవిశంకర్ – డోలేంద్ర ప్రసాద్ మధ్య జరిగిన పూర్తి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించవచ్చు.