ఘనంగా తెలుగువన్ 13వ వార్షికోత్సవ వేడుకలు

 

 

 

 CLICK HERE FOR MORE Teluguone

 

13 Anniversary Celebrations Photos

 

 

తెలుగువన్ డాట్ కామ్ 13 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రంగాలకి చెందిన అతిరధ మహారధులంతా విచ్చేసి ఆ సంబరాలకి మరింత శోభను కలిగించారు.

 

రాత్రి 7గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో సభ ప్రార౦భమైంది. చి|| ప్రవస్తి, చి|| ప్రవీణ్, చి|| హనీ తమ పాటలతో ఆహుతులను అలరించారు. అలాగే  సూర్య తేజ అండ్ టీం హాస్యభరిత లఘు నాటికలతో ఆహుతులను నవ్వుల్లో ముంచారు.

ఇక సభా కార్యక్రమాలు తెలుగువన్.కాం పరిచయంతో మొదలై,  తెలుగువన్.కాం క్రియేటివ్ హెడ్ మల్లిక్ గారి వందన సమర్పణతో ముగిశాయి.          

ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకరత్న డా.దాసరి నారాయణరావుగారు ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత శ్రీ రావూరి భరద్వాజగారితో పాటు ప్రముఖ కవి శ్రీ కె. శివారెడ్డిగారును, ప్రముఖ గజల్ గాయకులు గజల్ శ్రీనివాస్ గారును, లిటిల్ మ్యూజిషియాన్ అకాడమి వ్యవస్థాపకుడు రామాచారిగారులను సత్కరించారు.

ప్రముఖ జర్నలిస్ట్ ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ. ఎం.నాగేశ్వర రావు గారు ఆత్మీయ అతిధిగా విచ్చేసి ఇంటర్ నెట్ మీడియా అలాగే తెలుగువన్ ప్రస్థానాన్ని అభినందించారు.

ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత శ్రీ రావూరి భరద్వాజగారు మాట్లాడుతూ..''సాహిత్యం, కథలు రాస్తానని ఏనాడూ అనుకోలేదు. నా బాధలు, కన్నీళ్లు నాతోనే అంతం కాకూడదన్న ఆలోచనతోనే రాశాను'' అని అన్నారు.

దర్శకరత్న డా.దాసరి నారాయణరావుగారు మాట్లాడుతూ..తాను ఓ తెలుగు సభలో ఉన్న ఆనందాన్ని పొందుతున్నానని అన్నారు. ఇతర భాషల వారికి తమ మాతృభాషపై ఉన్న అభిమానం మన బాషపై మనకు ఉండకపోవడం బాధాకరమని అన్నారు. దేశంలో హిందీ తరువాత ఎక్కువమంది మాట్లాడే భాష తెలుగునీ, మనలో చిత్తశుద్ధి లేకపోవటమే మన భాష దుస్థితికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు.

''జ్ఞానపీట్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ జీవితానికి, నా జీవితానికి చాలా సారూప్యత ఉంది. ఇద్దరం కష్టాల కన్నీళ్ళను దాటుకొని పైకొచ్చిన వాళ్ళమే. గాడ్ ఫాదర్లు లేకపోయినా కృషి, పట్టుదలతో మేం ఈ స్థాయికి చేరాం. మా జీవితాలు చాలా మంది పేదవాళ్ళకి ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను..'' అని అన్నారు. తెలుగువన్ ఇంతగా విస్తరించినందుకు అభినందనలు తెలియజేస్తూ, మరింత ముందుకు దూసుకుపోవాలన్నారు.