TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సంప్రదాయం మేరకే.. ఆత్మకూరులో పోటీకి ‘దేశం’ దూరం

Published on: Fri Jun 3, 2022 7:41AM

వైసీపీ సర్వ నియమాలు, ఆనవాయితీలు, నిబంధనలకూ తిలోదకాలిచ్చేసింది. ప్రభుత్వం ప్రతిష్థత్మకంగా భావించి చేపట్టిన గడప గడపకూ, సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రలు తుస్సు మనడంతో.. జనంలో వ్యతిరేకత బట్టబయలై ఫ్రస్ట్రేషన్ లో మునిగిపోయింది. అందుకే ఆనవాయితీ ప్రకారం ఏకగ్రీవం కావలసిన ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీకి దిగాలంటూ విపక్షాన్ని సవాల్ చేస్తోంది. బీజేపీ ఇప్పటికే పోటీకి సై అంటూ వైసీపీ నెత్తన పాలు పోసే లాంటి నిర్ణయం తీసుకుంది.

బయటకు విమర్శలు, అంతర్గతంగా ఆ పార్టీకి మేలు చేయడానికి తహతహలా బీజేపీ తీరు ఉందన్న విమర్శలను కూడా ఆ పార్టీ పట్టించుకోవడం లేదు. వైసీపీ అయితే ఆత్మకూరులో పోటీ జరగాలి. తమ అభ్యర్థికి రికార్డు మెజారిటీ రావాలి, తద్వారా జనంలో తమ ప్రభుత్వ పరపతి ఇసుమంతైనా తగ్గలేదని చాటుకోవాలి అన్న ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తున్నది. అందుకే దమ్ముంటే ఆత్మకూరులో పోటీ చేయాలంటూ తెలుగుదేశం పార్టీకి సవాల్ విసురుతోంది.

వైసీపీ సవాల్ ను తెలుగుదేశం అధినేత వైసీపీ నీచత్వానికి పరాకాష్టగా అభివర్ణిస్తూ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఆత్మకూరులో తెలుగుదేశం పోటీ చేయడం లేదు అని స్పష్టం చేశారు. మరణించిన నేత కుటుంబీకుల ఎన్నికకు తెలుగుదేశం కట్టుబడి ఉందన్నారు.

గతంలో బద్వేలులో కూడా ఆ కారణంగానే తెలుగుదేశం పోటీ చేయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఆత్మకూరులోనూ అదే విధానాన్ని పాటిస్తున్నట్లు చెప్పారు. ఈ సాంప్రదాయాన్ని తెలుగుదేశం గౌరవిస్తుందని, ఆచరిస్తుందని స్పష్టం చేసిన చంద్రబాబు.. ఆత్మకూరులో పోటీ అంటూ వైసీపీ చేస్తున్న సవాళ్లు నీచమని విమర్శించారు.  ప‌ద‌విలో ఉన్న నేత చ‌నిపోయిన కార‌ణంగా జ‌రిగే ఎన్నిక‌ల్లో మృతుడి కుటుంబ స‌భ్యుల‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకోవాల‌న్న సంప్రదాయాన్ని టీడీపీ పాటిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.