తెదేపా, తెలంగాణా భాజాపాలో విభజన

 

నరేంద్రమోడీకి నీరాజనాలు, ఇటీవల ఎన్నికల ఫలితాలు.. వీటి పుణ్యమాని దేశవ్యాప్తంగా భాజాపా శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబుకుతుంటే రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ గందరగోళంలో మునిగిపోయింది. హైదరాబాద్‌లో నరేంద్రమోడి నిర్వహించిన బహిరంగ సభలో తొలిసారి పొత్తు పొడిచింది. అక్కడ నుంచి ఇరు పక్షాలూ దశల వారిగా సన్నిహితమైనట్టు కనిపిస్తుంది. భాజాపా అగ్రనేతలు చంద్రబాబుతో రాసుకు పూసుకు తిరుగుతున్నారు. తెలుగుదేశంతో పొత్తు దాదాపు ఖరారైనట్టే కనిపిస్తుంది. ఈ విషయంలో రాష్ట్ర శాఖ అభిప్రాయాలను అగ్రనాయకత్వం పట్టించుకోవటం లేదు. దీంతో ఇప్పటి దాకా భాజాపా రాష్ట్రస్థాయి నేతలుగా ఉన్నవారు తమ ప్రాధాన్యం తగ్గిపోతుందేమోననే భయంతో కారాలు మిరియాలు నూరుతున్నారు. అయితే రాష్ట్రనాయకుల్లో కొందరు తెదేపాతో పొత్తును పూర్తి స్థాయిలో ఆహ్వానింస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఇది పార్టీకి మంచి ఊపునిస్తుందని అంటున్నారు. ఈ విషయంలో చీలికలు వచ్చే ప్రమాదం కనిపిస్తుంటే.. మరో వైపు పులి మీద పుట్రలా సీమాంద్ర భాజాపా.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా సమైక్యగళమెత్తింది.  సీమాంద్రకు నష్టం కలిగేలా విభజన నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తూ త్వరలో సీమాంద్ర భాజాపా నేతలు తమ జాతీయనాయకుల్ని కలిసి చర్చించనున్నారు. ఏదేమైనా ఢిల్లీ  కోట మీద పాగా వేసే దిశగా దూసుకుపోతున్నపరిస్థితుల్లో ఆంద్రప్రదేశ్‌లో ఆ పార్టీకి ఇలాంటి
ఇబ్బందులు ఎదురవడం చింతించదగినదే.