తెలుగు యువత అధ్యక్షుడిగా పరిటాల శ్రీరామ్!!

మొన్న జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తరువాత టీడీపీకి వరసన ఎదురుదెబ్బలు ఎదురవుతూనే ఉన్నాయి. పార్టీకి బలమనుకున్న నేతలంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. కొందరు ఇప్పటికే పార్టీని కూడా వీడారు. వారి స్థానంలో మరొకరిని నియమించటం ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇలాంటి వాటిలో ఒకటి తెలుగు యువత అధ్యక్ష స్థానం. మొన్నటి వరకు ఈ స్థానంలో దేవినేని అవినాష్ ఉండేవారు. విజయవాడలో సీనియర్ రాజకీయ నేతగా ఉన్న దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్, విభజనకు ముందు కాంగ్రెస్ లో కొనసాగారు. 2014 లో కూడా ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి టిడిపిలో చేరారు. నెహ్రూ మరణంతో అవినాష్ కు చంద్రబాబు ధైర్యం చెప్పి తెలుగు యువత బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల్లో గుడివాడ నియోజక వర్గం టికెట్ కూడా కేటాయించారు కానీ ఈయన కొడాలి నాని చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా కనిపించారు. కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమోగానీ తమకు పార్టీలో సరైన ప్రాధాన్యం లేదంటూ వైసీపీలోకి మొగ్గు చూపారు. దీంతో పార్టీలో తెలుగు యువత అధ్యక్ష స్థానం ఖాళీ అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో పరిటాల శ్రీరామ్ పేరు గట్టిగా వినిపిస్తోంది . 

అనంతపురం జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన పేరు పరిటాల, ఒకప్పుడు పెత్తందారులకు వ్యతిరేకంగా నక్సల్స్ ఉద్యమంలో పాల్గొన్న పరిటాల రవీంద్ర, ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. భూస్వాములకూ, పెత్తందారులకు, నియంతలకు ఎదురు తిరిగిన రవి తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఆ క్రమంలో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయ్యారు. ఆయనకి అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభిమానులున్నారు. పరిటాల రవి ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాక ఆయన స్థానంలో ఆయన సతీమణి సునీత వచ్చారు. ఆమెను కూడా అభిమానులు కార్యకర్తలు గుండెల్లో పెట్టుకున్నారు. వైయస్ లాంటి బలమైన నేతల ప్రభావంతో కాంగ్రెస్ విజయం సాధించిన కాలంలో కూడా వరుసగా 3 సార్లు గెలిచి అయిదేళ్ల పాటు మంత్రిగా కొనసాగారు. మొన్నటి ఎన్నికల్లో రవి వారసుడిగా రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే రవి ఆధిపత్యం మొదలైన నాటి నుంచి తొలిసారి ఈ ఎన్నికల్లో ఓటమి చూసింది పరిటాల ఫ్యామిలీ. రాష్ట్రమంతా వైసిపి గాలి వీయడంతో ఇక్కడ కూడా ఓటమి తప్పలేదు. దీంతో ఒకింత నైరాశ్యంలో ఉండిపోయారు పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్. ఈ క్రమంలో పరిటాల కుటుంబం పార్టీ మారుతుందన్న పుకార్లు  కూడా వినిపిస్తున్నాయి. దీనికి స్పందిస్తూ తాము ఏ పార్టీకి మారడం లేదని క్లారిటీ కూడా ఇచ్చింది ఆ కుటుంబం. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న శ్రీరామ్ కు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తున్నారన్న వార్తలొచ్చాయి. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు ఈ న్యూస్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం.మరి ఈ కష్ట కాలం నుంచి యువతను పార్టీ నుంచి జారిపోకుండా బాబు ఎలా కాపాడుకుంటారో వేచి చూడాలి.