TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

త్వరలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. ఎందుకంటే?

Published on: Fri Apr 18, 2025 2:57PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారా? అన్న ప్రశ్నకు రాజకీయవర్గాలలో ఔననే సమాధానమే వస్తోంది. అయితే వీరి భేటీ ఎప్పుడు? ఎక్కడ జరుగుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. మొత్తం మీద ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యా ఎడతెగకుండా కొనసాగుతున్న విభజన సమస్యల పంచాయతీతో పాటు, జల వివాదాలకు కూడా శాశ్వత పరిష్కారం కనుగొనాలన్న లక్ష్యంతో ఇరు రాష్ట్రాల సీఎంలూ భేటీ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని రెండు రాష్ట్రాల అధికార వర్గాలలో జోరుగా చర్చ సాగుతోంది. 

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయి దశాబ్దా కాలం దాటుతోంది. అయితే ఇప్పటికీ విభజన సమస్యలు ఇరు రాష్ట్రాల మధ్యా అలాగే కొనసాగుతున్నాయి. జలవివాదాలు కూడా రెండు రాష్ట్రాలనూ ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించుకుంటేనే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా అభివృద్ధి, సంక్షేమాలపై సంపూర్ణంగా దృష్టి సారించడానికి వీలౌతుందన్న ఉద్దేశంతో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు.  ఇదే లక్ష్యంతో గత ఏడాది జులైలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఒక సారి భేటీ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని ప్రజాభవన్ లో జరిగిన ఈ భేటీ సుహృద్భావ వాతావరణంలో జరిగింది.  ఇప్పుడు మరోసారి భేటీ కావాలని ఇరువురూ భావిస్తున్నారు.  విభజన సమస్యలలో చాలా వరకూ కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమైపోయేవే ఉన్నాయని రాజకీయవర్గాలు అంటున్నాయి.

ఇక చట్ట ప్రకారం పరిష్కారం కావాల్సిన వాటి విషయంలో కూడా మాట్లాడుకుని ఆ ప్రక్రియను వేగవంతం చేయడానికి కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అవసరమని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాధ్యమైనంత త్వరలో మరోసారి భేటీ కావాలని చంద్రబాబు, రేవంత్ లు భావిస్తున్నారని, ఇందుకు సంబంధించి సూత్రప్రాయ నిర్ణయం కూడా అయిపోయిందనీ అభిజ్ణవర్గాల భోగట్టా. ఏపీలో  ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ , తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లు విభజన సమస్యల పరిష్కారం విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించాయని చంద్రబాబు, రేవంత్ లు భావిస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సాధ్యమైనంత త్వరగా విభజన సమస్యలకు పరిష్కారం కనుగొనాలని వారిరువురూ భావిస్తున్నారు.  త్వరలో వీరి మధ్య జరిగే భేటీలో జల వివాదాల అంశం కూడా ప్రస్తావనకు వస్తుందని అంటున్నారు.  ఉద్యోగుల పంపకం,  విద్యుత్ బకాయిలు, ఆస్తుల విభజన వంటి సమస్యలపైనా చర్చించి పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ భావిస్తున్నారని చెబుతున్నారు.