తెలుగువన్‌ చిత్రానికి అరుదైన గౌరవం

ఉగ్రవాదం నేపధ్యంలో తెలుగువన్‌ రూపొందించిన బాలల చిత్రం ‘అబ్దుల్‌’ మరో మైలురాయిని చేరుకుంది. నవంబర్‌ 8 నుంచి 14 వరకూ జైపూర్‌లో జరగనున్న జాతీయ బాలల చలనచిత్రోత్సవానికి ఎంపికైంది. దేశవిదేశాల నుంచి ఎంపిక చేసిన చిత్రాలను ప్రదర్శించే జైపూర్‌ చిత్రోత్సవంలో ఒక తెలుగు చిత్రం కూడా భాగం కావడం గర్వించదగ్గ విషయం. గత ఏడాది హైదరాబాదులో జరిగిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంతో ‘అబ్దుల్‌’ ప్రస్థానం మొదలైంది. అందులో ఏషియన్‌ పనోరమా విభాగంలో అనేక చిత్రాలతో పోటీపడి, విమర్శకుల అభినందలను పొందింది.

 

ఆపై పూనేలో జరిగిన లఘుచిత్రాల ప్రదర్శనలో జ్యూరీ ప్రత్యేక ప్రశంసలను సైతం సాధించింది. మనది కాదు అనుకునే ఉగ్రవాదం, రోజువారీ జీవితాల్లోకి ఎలా చొచ్చుకువస్తోందో ‘అబ్దుల్‌’ రచయిత, దర్శకుడు ఆనంద్‌ గుర్రం తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఉగ్రవాదానికి కులమతాలు, పేదాగొప్పా, చిన్నాపెద్దా తారతమ్యాలు ఉండవని సున్నితంగా చాటిచెప్పిన ‘అబ్దుల్‌’ అప్పటి వార్తాపత్రికలలో పతాకశీర్షికగా నిలిచింది. తెలుగువాడి సృజనను, స్పందనను చాటిన అబ్దుల్ మరెన్ని విజయాలను సాధిస్తుందో వేచి చూడాల్సిందే!