తెలుగు మహాసభలకు బాబు రాను అన్నారా..?

ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో ప్రారంభోత్సవంతో పాటు జీఈఎస్-2017 సదస్సును విజయవంతంగా నిర్వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అయితే ఇంతటి ప్రెస్టేజీయస్ ఈవెంట్స్‌కు తోటి తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించకపోవడంతో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అప్పుడు ఏదోలే అని సరిపెట్టుకున్నప్పటికీ తాజాగా జరుగుతున్న తెలుగు మహాసభల్లో కూడా చంద్రబాబు పేరు ఎక్కడ వినిపించకపోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రిపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

వేడుకల్ని ఇంత బాగా చేసి సోదరుడిని అవమానించారు అంటూ టీ సర్కార్‌ తీరుపై మండిపడుతున్నారు. దీంతో రెండు రాష్ట్రాల అధికార వర్గాలు స్పందించాయి. ప్రపంచ తెలుగు మహాసభలకు రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ హాజరవుతున్న 19వ తేదీన రావాల్సిందిగా .. చంద్రబాబును స్వయంగా ఆహ్వానించాలని కేసీఆర్ భావించారట.. అందుకు తగ్గట్టుగానే ఎప్పుడు కుదురుతుందో తెలుసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారట. కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ సీఎంవో అధికారులు.. ఏపీ సీఎంవోను సంప్రదించగా.. తన ప్రోగ్రామ్స్ అన్ని అప్పటికే ఫిక్స్ అయిపోయాయని, 17వ తేదీ నుంచి తాను ఇండియాలో ఉండటం లేదని అధికారులు వర్తమానం పంపారు. అంతే తప్పించి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇరు రాష్ట్రాల అధికారులు అంటున్నారు.