తెలుగు చిత్ర సీమపై ఆ దేవుడు కూడా కక్ష కట్టేడేమో
Published on: Sun Jan 4, 2015 3:41PM
.png)
తెలుగు చిత్ర పరిశ్రమకు ఏదో శని పట్టుకొన్నట్లుంది. గత ఏడాది కాలంలో తెలుగు చిత్రసీమకు తమదైన శైలిలో కొత్త సొబగులు అద్దిన అనేక మంది హేమాహేమీలనదగ్గ నటులు, దర్శకులు, రచయితలు మరణించడం చాలా విస్మయం కలిగిస్తోంది.
తెలుగు చిత్ర సీమ నిలిచి ఉన్నంత కాలం ఎవ్వర్ గ్రీన్ హీరోగా నిలిచి ఉండే అక్కినేని నాగేశ్వర రావు చనిపోయి అప్పుడే ఏడాది కావస్తోంది. సీతమ్మ అంటే ఆమెలాగే ఉంటుంది అనుకొనే అంజలీదేవి కూడా ఆయనతో బాటే వెళ్ళిపోయారు. ఆ తరువాత కొన్ని నెలలకి మన అందరినీ గడగడలాడించిన తెలంగాణా శకుంతల వెళ్లిపోయింది. అలనాటి అందాల నటి మంజుల, విలక్షణ నటుడు ముక్కు రాజు ఇరువురూ కూడా జులై నెలలోనే చనిపోయారు.
తెలుగు అక్షరానికి, బాషకి, యాసకి, సంస్కృతికి, సినిమాకి కూడా తన కుంచెతో సరికొత్త అందాలు అద్దిన బాపు ఇక శలవంటూ నిరుడే వెళ్ళిపోయారు. ఒకప్పుడు విలన్ వేషాలు వేసి తన స్వశక్తితో, ప్రతిభతో రియల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకొన్న శ్రీహరి అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయినప్పుడు ఎవరూ నమ్మలేకపోయారు.
ఆయన పోయిన నెలరోజులకే అంటే నవంబరులో తన విలక్షణ నటనతో తెలుగు ప్రజలందరినీ తుత్తి పరిచిన ఏవీయస్ చనిపోయారు. సరిగ్గా మళ్ళీ నెలరోజులకే ‘కూల్ బాబు కూల్’ అంటూ ఎవరికీ చెప్పాపెట్టకుండా చాలా కూల్ గా వెళ్ళిపోయారు ధర్మవరం. ఎన్ని ఒడిదుకులు ఎదురయినా ఎప్పుడూ చిర్నవుతో కనబడే ‘లవర్ బాయ్’ ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొన్న తరువాత గానీ అతను తీరని వేదన అనుభవించారనే సంగతి ఎవరూ గుర్తించలేకపోయారు.
కత్తి లాంటి సినిమాలు తీసిన నందమూరి జానకీ రామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. సంగీత చక్రవర్తి చక్రి తను వచ్చిన పని ఇంకా పూర్తి చేయకుండానే ఆ దైవ సన్నిధిలో స్వరార్చన చేయడానికన్నట్లు హడావుడిగా వెళ్ళిపోయారు.
తన గుప్పెడు మనసులో తెలుగు వారికి చోటు కల్పించి మరో చరిత్ర సృష్టించిన బాలచందర్ కూడా ఆ చుక్కల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన ఆహుతీ ప్రసాద్ కూడా అగ్నికి ఆహుతయిపోతున్నారు.
ఇవ్వన్నీ చూస్తుంటే ‘పసివాడో ఏమో..ఆ పైవాడు...తను చేసిన బొమ్మలతోనే కలబడతాడు..’ అని ఎవరో కవి పలికిన పలుకులు గుర్తుకురాక మానవు. తెలుగుచిత్ర సీమ మీద ఆదేవుడు ఎందుకు ఇంత కక్ష కట్టాడో...


