చిత్ర పరిశ్రమ విచిత్ర సమస్యలు

 

దక్షినాది చిత్రపరిశ్రమతోబాటు మన తెలుగు చిత్రపరిశ్రమ కూడా జనవరి 7వ తేదిన సర్వీస్ టాక్స్ రద్దు చేయాలంటూ ఒక్కరోజు బంద్ పాటించి, ప్రభుత్వానికి తన నిరసన తెలియజేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే తాము పీకలలోతు కష్టాలలో కూరుకుపోయున్నామని, మళ్ళీ తమపై కొత్తగా సర్వీస్ టాక్స్ పేరిట మరింత భారం మోపడం చాలా అన్యాయమని యావత్ దక్షినాది చిత్ర పరిశ్రమ వర్గాలవారు నిరసన తెలియజేస్తూ ఒక్కరోజు బంద్ పాటించేరు.

 

అయితే, మిగిలిన వారి సంగతి ఎలాఉన్నపటికీ, మన చిత్ర పరిశ్రమలో నిర్మించిన ప్రతీ చిన్న, పెద్దా సినిమా పదిరోజులు కూడా ఆడకపోయినా ‘సూపర్ హిట్’ అంటూ విజయోత్సవాలు జరుపుకొంటూ, ‘రికార్డ్ కలెక్షన్ల’ని సదరు నిర్మాతలు ప్రకటించుకోవడం మనం చూస్తూనే ఉన్నాము. గత రెండు సం.లో విడుదలయిన అనేక చిన్న, పెద్దా సినిమాలు విడుదలయిన మొదటి వారంలోనే డబ్బాలు సర్దుకొని వెనక్కి వెళ్లిపోతుంటే, పరువు తక్కువని పెద్ద హీరోల సినిమాలను బలవంతంగా కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు నడిపించిన సంగతి మనకి తెలుసు. అయినప్పటికీ ఆ సినిమాలకు ‘సూపర్ హిట్’, ‘రికార్డ్ కలెక్షన్స్’ ట్యాగులు తగిలించుకొని బేషజాలు ప్రదర్సించడం ఆనవాయితీగా మారింది.

 

అల్లు అర్జున్ నటించిన ‘వరుడు’ మరియు ‘బద్రీనాథ్’ మహేష్ బాబు- ‘ఖలేజా’, జూ.యన్టీఆర్-‘శక్తి’ పవన్ కళ్యాణ్-‘తీన్ మార్’, ‘పంజా’ బాలకృష్ణ- ‘శ్రీమన్నారాయణ’ ఇలాగ చెప్పుకొంటూపోతే చాల పెద్ద లిస్టు అవుతుంది. భారీ బడ్జెట్ తో నిర్మింపబడిన ఈ సినిమాలన్నీ నిర్మాతలను ఆర్దికంగా దెబ్బతీసినాకూడా సదరు నిర్మాతలు ‘సూపర్ హిట్’, ‘రికార్డ్ కలెక్షన్స్’ అనే ట్యాగులు తగిలించుకొని తిరిగినప్పుడు, అసలే డబ్బుకు కటకటలాడుతున్నప్రభుత్వం దృష్టి వీరిపై పడటంలో ఆశ్చర్యం ఏముంది? సినిమాలు బాగా ఆడేయా లేదా అనే సంగతి ఆలోచించవలసిన అవసరం ప్రభుత్వానికి లేదు. గానీ, నిర్మాతలు స్వయంగా పేపర్లకి, టీవీలకి ఎక్కి మరీ వేసుకొన్న ‘టముకు’ మాత్రం వారి ముక్కు పిండి టాక్స్ లు వసూలుచేయడానికి ప్రభుత్వానికి మంచి మార్గం చూపుతోంది. ఆదాయపన్ను శాఖ కళ్ళు ఎప్పుడూ తమ సినిమాపరిశ్రమ మీదే ఉన్నసంగతి తెలిసికూడా నిర్మాతలు ఈ విదంగా భేషజాలకు పోవడంవల్లనే, ‘సినిమా పరిశ్రమ వద్దనుండి ఎంతయినా సొమ్ము పిండుకోవచ్చుననే’ ఆలోచనని మన చిత్రసీమలోని పెద్దలే స్వయంగా ప్రభుత్వానికి కలిగించేరని చెప్పక తప్పదు. దేశంలో మిగిలిన చిత్రపరిశ్రమలు కూడా ఇందుకు మినహాయింపు కాదని చెప్పక తప్పదు.

 

ఇక, మన చిత్రపరిశ్రమలో భారీ నష్టాలు పాలవుతున్నామని గగ్గోలుపెడుతున్న మన నిర్మాతలు మరియు ఫైనాన్సర్స్ మరి చిత్రనిర్మాణ వ్యయం తమ అదుపు తప్పుతున్నసంగతి తెలిసి కూడా, భారీ బడ్జెట్ సినిమాలకే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారో వారికేతెలియాలి. హీరోలకి, దర్శకులకే తమ బడ్జెట్లో కోట్లాది రూపాయలు ఎందుకు సమర్పించుకొంటున్నారో తెలియదు. పెద్ద హీరోలతో సినిమా తీసినట్లయితేనే తమకి ఒకేసారి పెట్టిన పెట్టుబడికి పదింతలు వచ్చేస్తుందనే వారి గుడ్డి నమ్మకమే దానికి కారణం అయి ఉండవచ్చును. అయితే, పైన పేర్కొన్నవన్నీ పెద్ద హీరోలతో తీసినవే, నిర్మాతలను నట్టేట ముంచినవే. అయినా, నిర్మాతల ఆలోచనలో మార్పురాలేదు. అదికాక, పెద్ద సినిమా అంటే విదేశాలలో రెండు మూడు పాటలయినా ఉండాలనే సిద్దాంతం ఎవరు కనిపెట్టేరో గానే అది చిన్న నిర్మాతల పాలిత కూడా గుదిబండగా మారిందిప్పుడు.

 

సినీ పరిశ్రమ బాగుంటేనే అందరూ బాగుంటామని మైకులు పట్టుకొని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, కధా రచయితలూ మరి వారి పారితోషికాలు ఎందుకు తగ్గించుకోవడం లేదు? చిత్ర పరిశ్రమ గురించి అంత బాధపడేవారు స్వచ్చందంగా తాము తీసుకొంటున్న లక్షలాది లేదా కోట్లాది రూపాయల పారితోషికం తగ్గించుకొంటామని ఒక్కసారీ కూడా ఎందుకు అనలేక పోతున్నారు? ఆ విదంగా తగ్గించుకోమని ఎందుకు నిర్మాతలు అడగలేకపోతున్నారు? ఒక హీరో లేదా హీరోయిన్ ఒక సినిమాలో నటించడానికి అసలు అంత ఎక్కువ ఎందుకు ఇవ్వాలి? అని అడగలేని మన చిత్రపరిశ్రమ ప్రభుత్వాన్ని నిలదీయడం అవివేకం.

 

ఒక పెద్ద హీరో లేదా దర్శకుల కాళ్ళ మీదపడి మరీ కోట్లు సమర్పించుకొనే మన నిర్మాతలు, మరి జూనియర్ ఆర్టిస్టూలకి కనీసం రోజుకి రూ.500 కూడా ఇచ్చేందుకు ఎందుకు మనస్కరించడంలేదు? తమకు కోట్లు ముడుతున్నపుడు తమ కన్నా ఎక్కువ శ్రమపడే జూనియర్ ఆర్టిస్టూలకి కూడా సమాన న్యాయం జరగాలని ఏ హీరోకూడా ఎందుకు కోరుకోవట్లేదు? తమ సినిమా విజయవంతం అవడంలో ఎంతోకొంత పాత్ర పోషించిన జూనియర్ ఆర్టిస్టూలకి, లయిట్ బాయ్ లు, మేకప్ మనుషులు, వంటి అనేక మందిని పట్టించుకోని మన చిత్రపరిశ్రమని ప్రభుత్వం మాత్రం ఎందుకు పట్టించుకోవాలి?ముందుగా మన చిత్రపరిశ్రమ తనని తానూ సరిదిద్దుకొని తరువాత ప్రభుత్వ సహాయానికి ఎదురు చూస్తే అందరు హర్షిస్తారు.

 

అయినా, ప్రభుత్వం పెంచే ప్రతీ పైసా పన్నును వారు భరిస్తున్నారా? అంటే లేదనే సమాదానం వస్తుంది మనకు. పెరిగిన టాక్స్ లను, టికెట్ ధరలను పెంచడం ద్వారా తిరిగి ప్రేక్షకుల నెత్తినపెట్టి వారు తప్పుకొంటున్నారు. మరి అటువంటప్పుడు, ప్రభుత్వం ఎంత పన్నువేస్తేవారికేమి తేడా చేస్తుంది?

 

గతంలో దాదాపు రెండు నెలలు పాటు స్ట్రయిక్ చేసి, తనకు తానే ఆర్దిక సమస్యలోకి నెట్టుకొన్నమన చిత్రపరిశ్రమ, ఇప్పుడు తానూ నష్టాలలో ఉన్నామని గగ్గోలు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. ఆనాడు చిత్రపరిశ్రమలో అందరూ కలిసి తీసుకొన్న నిర్ణయాలలో కొన్నిటినయినా వారు ఖచ్చితంగా అమలు చేసి ఉంటే, వారీనాడు ఈవిదంగా వీధినపడే అవసరం వచ్చేది కాదేమో. తనను తానూ సంస్కరించుకోలేని మన చిత్రసీమకు మరొకరిని నిందించే హక్కు ఉండదు.