కేసీఆర్‌ను టీడీపీలో చేర్చారు

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకప్పుడు తెలుగుదేశం కుటుంబసభ్యుడు అన్న సంగతి తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా చెబుతారు. క్రియాశీలక కార్యకర్తగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన టీడీపీకి ఎనలేని సేవలందించారు. సిద్ధాంతపరమైన విబేధాల కారణంగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట వేరు కుంపటి పెట్టుకున్నారు కేసీఆర్. తెలంగాణ ప్రజల దశాబ్దాల కల అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రజాకర్షక పథకాలతో.. సంక్షేమ కార్యక్రమాలతో మంచి పాలనను అందిస్తున్నారు. ఆయనకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.

 

అమరావతి శంకుస్థాపన సందర్భంగా..తిరుపతికి కుటుంబసమేతంగా వచ్చిన వేళ..తాజాగా పరిటాల శ్రీరామ్‌ పెళ్లికి అనంతపురం వెళ్లిన గులాబీ బాస్‌కి ఏపీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మా సొంత నేత అన్నంతగా తెలుగుదేశం శ్రేణులు కూడా జయ జయ ధ్వానాలు పలికాయి. ఇప్పుడు ఏకంగా కేసీఆర్‌ను టీడీపీ నేతను చేసేశారు తెలుగు తమ్ముళ్లు. తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేందుకు.. వచ్చే ఎన్నికల నాటికి పటిష్టం అయ్యేందుకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఆ పార్టీ అధినాయకత్వం.

 

అధినేత సూచనల మేరకు ఆ కార్యక్రమాన్ని వాడవాడలా విజయవంతంగా నిర్వహిస్తున్నారు నేతలు. అయితే ఈ కార్యక్రమంలో కేసీఆర్‌ను భాగస్వామిని చేసేశారు ప్రకాశం జిల్లాకు చెందిన నాయకులు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొనేందుకు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వెలమవారిపాలెం గ్రామానికి వస్తున్నారు. ఎమ్మెల్యే రాకను పురస్కరించుకొని గ్రామపెద్దలు భారీ ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. వాటిలోని ఒక ఫ్లెక్సీలో పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఫోటో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటొలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోను కూడా చేర్చడంతో అది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏది ఏమైనా కేసీఆర్‌పై తమకున్న అభిమానాన్ని ఆ ఊరి వాసులు ఇలా చాటుకున్నారన్నమాట.