TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నెహ్రూ రాకతో వంశీ ఆలోచనలో పడ్డాడా..?

Published on: Fri Sep 16, 2016 2:41PM

కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూ ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు కావడం, బలమైన సామాజికవర్గం అండదండలు, ప్రత్యేకించి మూడున్నర దశాబ్దాలుగా విజయవాడ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి కావడంతో ఆయన రాకను ఎవరూ వ్యతిరేకించడం లేదని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. అయితే ఒక్కనేత మాత్రం ఆయన పసుపు కండువా కప్పుకోవడాన్నీ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆయనేవరో కాదు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. అందుకు కారణం పాత విబేధాలు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో నెహ్రూ, వంశీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది.

తనను దేవినేని వర్గం టార్గెట్ చేశారని వల్లభనేని వంశీ బహిరంగంగానే విమర్శించారు. అక్కడితో ఆగకుండా తనను హత్య చేయించేందుకు కుట్ర పన్నినట్టు చెప్పడంతో అప్పట్లో బెజవాడ రాజకీయాలు వేడెక్కాయి. అలాంటి నేత ఇప్పుడు టీడీపీలోకి రావడాన్ని వంశీ జీర్ణించుకోలేకపోతున్నారు. వంశీ, నెహ్రూలు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం..ఆ సామాజిక వర్గంలో వంశీ కంటే నెహ్రూకే మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో బెజవాడలో దేవినేనిదే పైచేయి అవుతుందని వంశీ భావిస్తున్నారు. వంశీకి గతంతో పోలిస్తే టీడీపీలో ప్రాధాన్యత అంతంత మాత్రమే. ఈ టైంలో నెహ్రూ రాకతో తనను ఎవరూ పట్టించుకోరని వంశీ ఫీలైపోతున్నారు. అలాంటపుడు పార్టీలో ఉండటం అనవసరమని వల్లభనేని భావిస్తున్నారట. దీంతో వంశీ ఏం చేయబోతున్నారా అని పార్టీ నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.