TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీడీపీ చెంతకు రాజకీయ ఉద్ధండులు..? పార్ట్-2

Published on: Fri Aug 5, 2016 9:42AM

ఇక టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్న మరో నేత డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి. తెలుగు రాజకీయాలపై కాస్తంత అవగాహన ఉన్నవారికి కూడా పరిచయం ఉన్న వ్యక్తి. కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు..ఎంత సీనియర్ అంటే వైఎస్‌తో సరిసమానమంత. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట మండలం సుంకేసుల గ్రామానికి చెందిన డీఎల్ వృత్తిరీత్యా డాక్టర్. వైద్యుడిగా ప్రజలకు సేవలందించి..మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఆ పరిచయాలే ఆయన రాజకీయాలవైపు వెళ్లడానికి కారణమంటారు. 1978లో మైదుకూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని 5 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

 

రాజకీయ జీవితంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా..నాలుగు సార్లు మంత్రిగా పనిచేశారు. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు రావడంతో రెండేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం త్వరలో టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారని మైదుకూరులో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌తో కూడా చర్చించినట్లు సమాచారం. కడప జిల్లాను కంచుకోటగా మార్చుకున్న జగన్‌ను రాజకీయంగా దెబ్బ కొట్టాలని భావిస్తున్న తెలుగుదేశానికి డీఎల్ అందివచ్చిన అవకాశంగా మారారు.

 

ఎందుకంటే డీఎల్‌కు మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది..మైదుకూరు నియోజకవర్గంపై ఆయనకు బోలెడంత పట్టుతో పాటు గణనీయమైన ఓటు బ్యాంక్ ఉంది.. గ్రామాలకు, గ్రామాలే డీఎల్ వెంట నడుస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుత, పాత ప్రజాప్రతినిధుల్లో చాలా మంది ఆయన శిష్యులే. ఇలాంటి పరిస్థితిలో డీఎల్ సైకిల్ ఎక్కితే జగన్‌ కంచుకోట బద్దలవ్వాల్సిందే. అయితే డీఎల్ రాకను మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ సుధాకర్ యాదవ్ అడ్డుకుంటున్నారట. గత ఎన్నికల్లో మైదుకూరు నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన సుధాకర్‌కు సపోర్ట్ చేస్తానని డీఎల్ మాట ఇచ్చారట..తీరా ఎన్నికల సమయంలో హ్యాండిచ్చేసి వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డికి సహకరించారని సుధాకర్‌ చంద్రబాబు వద్ద ఫిర్యాదు చేశారు. అందుకే డీఎల్ వస్తానంటే సుధాకర్ వద్దంటున్నారట. డీఎల్ వల్ల పార్టీకి లాభం జరుగుతుందని భావించిన తెలుగుదేశం అధినాయకత్వం సుధాకర్‌ యాదవ్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా నియమించింది. ఇప్పుడు వాతావరణం తనకు అనుకూలంగా ఉండటంతో చంద్రబాబు సమక్షంలో పచ్చ కండువా కప్పుకోవాలనుకుంటున్నారట డీఎల్.