TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీడీపీ చెంతకు రాజకీయ ఉద్ధండులు..? పార్ట్-1

Published on: Thu Aug 4, 2016 5:10PM

వారిద్దరూ కాకలు తీరిన రాజకీయ ఉద్దండులు..రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అటుపోట్లను ఎదుర్కొన్నారు. అయినా పరిస్థితులకు తలొంచక..ఎదురీదారు. కాని ఆంధ్రప్రదేశ్ విభజన రాష్ట్రాన్ని కష్టాల్లోకి నెట్టినట్లే..వారి రాజకీయ భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టింది. అయితే చీకట్లో వెలుగులా తెలుగుదేశం పార్టీ వారికి కనిపించింది. అతి త్వరలో వారిద్దరూ టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వారిలో ఒకరు కృష్ణాజిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూ, మరోకరు కడప జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత డాక్టర్ డీఎల్. రవీంద్రారెడ్డి.

 

నెహ్రూ టీడీపీ వ్యవస్థపాక సభ్యుల్లో ఒకరు 1983 నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995లో టీడీపీలో చీలిక వచ్చిన సమయంలో నెహ్రూ లక్ష్మీపార్వతి వైపు ఉండిపోయారు. తదనంతర పరిణామాలతో ఆయన అయిష్టంగానే కాంగ్రెస్‌లో చేరారు. ఎన్టీఆర్ అంటే నెహ్రూకు ఎంతో అభిమానం. ఆయనకు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న విషయాన్ని కన్నీళ్లు పెట్టుకుని మరీ దేవినేని చెప్పారు. కాంగ్రెస్‌ రాజకీయాలలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌తో చనువుగా ఉండేవారు. 2009లో వైఎస్ మరణం, 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్‌లో నెహ్రూ ప్రభ క్రమంగా మసకబారుతూ వచ్చింది.

 

తన రాజకీయ భవిష్యత్‌పై దేవినేని డైలమాలో ఉన్న సమయంలో టీడీపీ నేతలు ఆయన్ను తిరిగి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో నెహ్రూకి మంచి పట్టుంది. ఆయన సేవలు టీడీపీకి అందితే పార్టీకి జిల్లాలో తిరుగుండదని భావించిన తెలుగుదేశం అధినేత నెహ్రూతో చర్చలు జరపాల్సిందిగా పార్టీ నేతలకు సూచించారు. అటు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు కూడా నెహ్రూ రాకపై సుముఖంగా ఉండటంతో ఆయనకు అడ్డులేకుండా పోయింది. అయితే సీఎం చంద్రబాబు, దేవినేని నెహ్రూ ఇప్పటి వరకు ముఖాముఖి కలిసి మాట్లాడుకున్న సందర్భం లేదు. వీరిద్దరూ కనుక ఒకే వేదికపైకి వస్తే నెహ్రూకి పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారన్నది తెలుస్తుంది. అటు తాను టీడీపీలో చేరుతానని వస్తున్న వార్తలను ఊహాగానాలుగా కొట్టిపారేశారు నెహ్రూ..అయితే ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు.