తెలంగాణా అమరవీరుల కుటుంబీకులకు ఉద్యోగాలు

 

పంచాయితీ మరియు స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో నిన్న వరంగల్ జిల్లా ఖాజీపేటలో నిర్వహించిన సభలో, ముందుగా ఆయన వేదికపై అమర్చిన అమర వీరుల స్థూపం నమూనా వద్ద ఘన నివాళులు అర్పించారు. తరువాత ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికలలో తెదేపాను గెలిపిస్తే తెలంగాణా కోసం బలిదానాలు చేసిన అమరవీరుల కుటుంబీకులకు ప్రభుత్వోద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసారు. తమ పార్టీ ఎప్పుడు కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి, చేసిన ప్రతీ వాగ్దానాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. తెదేపా హయంలో స్థానిక సంస్థలకు సకాలంలో నిధులు విదుదల చేస్తూ, ఎన్నికలు నిర్వహిస్తూ వాటిని బలోపేతం చేయగా, కాంగ్రెస్ అధికారం చెప్పటిన తరువాత వాటిని క్రమంగా బలహీనపరిచిందని ఆరోపించారు. తమ హయంలో సర్పంచులకు గౌరవ వేతనం కూడా ఏర్పాటు చేసిన విషయం ఆయన గుర్తు చేసారు. తెదేపా ప్రధానంగా కార్యకర్తల బలం మీదనే ఆధార పది ఉందని అందువల్ల రానున్న పంచాయితీ ఎన్నికలలో పార్టీని గెలిపించే బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొన్నట్లు తెలంగాణా పేరు చెప్పుకొని తెరాస నేతలు కోట్లు పోగేసుకొన్నారని, అటువంటి పార్టీ వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని ఆయన అన్నారు.