ఇంటింటికి వెళ్తే.. టీడీపీ పరిస్థితి తెలిసింది

అనుభవం, ముందుచూపు తదితర కారణాలు బేరీజు వేసుకున్న ఆశేష జనవాహిని అండదండలతో తెలుగుదేశం పార్టీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని అందుకుంది. సుమారు 10 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దిక్కుమొక్కు లేని రాష్ట్రానికి ఒక దిక్కును వెతికే పనిని ఆయన భుజానికెత్తుకున్నారు. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్‌లకు తోడు మొత్తం పరిపాలనా యంత్రాంగాన్ని ఆంధ్రకు తరలించారు. ఒడిదుడుకులు ఎదుర్కొంటూ.. రాష్ట్రాన్ని అభివృద్ధిపథాన నిలుపుతున్నారాయన.

 

ఈ ప్రయాణంలో ఇప్పటికే మూడున్నరేళ్లు గడిచిపోయింది.. మరో ఏడాది గడిస్తే మళ్లీ ఎన్నికల కోలాహలం మొదలవుతుంది. అప్పటికీ ఇప్పటికీ కాలం ఎంతో మారిపోయింది. ప్రధాన ప్రతిపక్షం పావులు కదుపుతూ సమరానికి సన్నద్ధం అవుతోంది. మరి అధికార పార్టీ పరిస్థితి ఏంటీ..? క్యాడర్ ఎలా ఉంది.. నాయకులంతా సమన్వయంతో పనిచేస్తున్నారా..? ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా ఎదుర్కొగల సత్తా పార్టీకి ఉందా..? అనే అంశాలపై దృష్టిపెట్టిన చంద్రబాబు నాయుడు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నేతలు అందరి కృషితో ఈ కార్యక్రమం ఊహించిన దానికి మించి విజయవంతమైంది. పార్టీ ఎక్కడ బలంగా ఉంది. ఎక్కడ బలహీనంగా ఉందన్న విషయం స్పస్టంగా తెలిసింది. అంతేకాదు పలు అక్రమాలు కూడా బయటకు వచ్చాయట.

 

తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే అందరూ రోడ్ల గురించి మాట్లాడతారు. సీసీ రోడ్ల నిర్మాణంలో సర్కార్‌కు మైలేజ్ వచ్చిందనే విషయం సీఎం దాకా వచ్చింది. అయితే పలు ప్రాంతాల్లో రోడ్లు వెయ్యాల్సిన చోట వెయ్యకుండా తమ బంధు, మిత్రులు ఉండే చోట వేశారనే సంగతి బయటకు రావడంతో ఆ ప్రాంత నేతలకు మంత్రులు, ఎమ్మెల్యే చురకలు వేశారు. కార్యకర్తల్లో చాలా మంది ఉత్సాహంగా పనిచేస్తున్నా.. లోకల్ లీడర్ల అవినీతి, అక్రమాల కారణంగా క్యాడర్ అడుగు ముందుకు వేయలేకపోతోందట. ఇప్పటి వరకు ర్యాంకుల కోసం ఆరాటపడిన నేతలకు అసలు తత్త్వం బోధపడేసరికి ప్రజల వద్దకు పరుగులు తీస్తున్నారట. మొత్తానికి ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నాయకులకు జ్ఞానోదయం అయ్యిందని పచ్చ కండువాలు గుసగుసలాడుకుంటున్నాయి.