పిల్లల మీద టీవీ ప్రభావం - ఓ ప్రయోగం

 

మీడియా ప్రభావం పిల్లల మనసు మీద ఉంటుందా? అది వారి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుందా?... ఇలాంటి ప్రశలు మనకి కొత్తకాదు. పిల్లలు తాము చూసే దానినే అనుకరిస్తారు కాబట్టి మీడియా ప్రభావం వారి మీద తప్పకుండా ఉంటుందని కొందరు వాదిస్తే... పిల్లవాడి వ్యక్తిత్వాన్ని అతని విచక్షణా, జన్యునిర్మాణమే ప్రభావితం చేస్తుందని మరి కొందరు వాదిస్తుంటారు. కానీ 50 ఏళ్ల క్రితమే ఈ అంశం మీద జరిగిన ఓ ప్రయోగం ఈ విషయం మీద కొన్ని స్పష్టమైన ఫలితాను చూపుతోంది.

 

బోబో డాల్‌ ఎక్స్‌పరిమెంట్‌

అమెరికాకి చెందిన ‘అల్బెర్ట్‌ బండూర’ అనే శాస్త్రవేత్త 1961లో చేసిన ప్రయోగమే బోబో డాల్ ఎక్స్‌పరిమెంట్‌. బోబో డాల్‌ అంటే మరేదో కాదు, మనం ఎంత తోసినా కూడా మళ్లీ స్థిరంగా నిలబడే బొమ్మ. ఈ ప్రయోగం కోసం బండూర, స్టాన్‌ఫార్డ్‌ నర్సరీ బడిలోంచి 72 మంది పిల్లలను ఎన్నుకొన్నాడు. వీరిలో సగం మగపిల్లలు సగం మంది ఆడపిల్లలు. ఈ 72 మందినీ బండోర మూడు బృందాలుగా (24+24+24) విభజించారు.

 

ఆట మొదలైంది

బోబో డాల్‌ ప్రయోగం కోసం పరిశోధకులు ఒక గది నిండా ఆటబొమ్మలను ఉంచారు. అలాంటి గదిలోకి ఒకొక్క పిల్లవాడినీ పంపారు. పిల్లవాడు గదిలో ఉండగానే ఒక వ్యక్తి గదిలోకి ప్రవేశించేవాడు. అతను బొమ్మల్ని చూస్తున్నట్లుగా కాసేపు నిలబడి నిదానంగా బోబో డాల్‌తో ఆడటం మొదలుపెట్టేవాడు. అలా మొదలైన ఆట కాస్తా క్షణాల్లో దూకుడుగా మారిపోయేది. ఆ బొమ్మని పదే పదే తన్నడం, గాల్లోకి ఎగరేయడం, సుత్తితో బాదడం, బూతులు తిట్టడం... లాంటి చేష్టలన్నీ సాగేవి. అయితే ఒక 24 మంది పిల్లల ముందే ఇలాంటి ప్రదర్శన జరిగింది. మరో 24 మంది పిల్లల ముందు మరో వ్యక్తి ప్రవేశించినప్పటికీ, అతను ఆ గదిలో ఉన్న కాసేపు ప్రశాంతంగా ఉండిపోయాడు. ఇక ఇంకో 24 మంది పిల్లల విషయంలో అసలు మరో వ్యక్తి గదిలోపలకి ప్రవేశించనేలేదు.

 

 

అనుకరణా మొదలైంది

ఇలా రకరకాల వాతావరణాల మధ్య ఉన్న పిల్లలను కాసేపటి తరువాత మరో గదిలోకి పంపారు పిల్లలు. అక్కడ పరిశోధకులు ఊహించినదే జరిగింది! అక్కడ పిల్లలకు బోబో డాల్ కనిపించగానే వారు పెద్దలను అనుకరించడం మొదలుపెట్టారు. ఏ పిల్లల ముందైతే పెద్దవారు హింసాత్మకంగా ప్రవర్తించో, ఆ పిల్లలు కూడా బోబో డాల్‌ని బాదడం మొదలుపెట్టారు. ఏ పిల్లల ముందైతే పెద్దవారు నిగ్రహంగా, ప్రశాంతంగా ఉన్నారో... ఆ పిల్లలు మిగతావారందరికంటే క్రమశిక్షణగా మెలగడం మొదలుపెట్టారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ ప్రభావంలో ఆడపిల్లలు, మగపిల్లలు అన్న తేడా కనిపించలేదు. కాకపోతే మగపిల్లలు బొమ్మ మీద చేతలు ప్రయోగిస్తే, ఆడపిల్లలు మాటలు ప్రయోగించారట.

 

 

పరిమితులు లేకపోలేదు

బోబో డాల్‌ ఎక్స్‌పరిమెంట్‌ పరిపూర్ణమైన ప్రయోగం అని చెప్పుకోవడానికి లేదు. ప్రయోగశాలలో జరిగిన ఈ పరీక్ష నిజజీవితంలో ఎంతవరకూ ప్రభావం చూపుతుంది? హింసాత్మక ధోరణిని గమనించిన పిల్లవాడు కొన్నాళ్ల తర్వాత కూడా ఇలాగే ప్రవర్తిస్తాడా! వంటి ప్రశ్నలెన్నో తలెత్తాయి. కానీ తానేది చూస్తాడో దానిని పిల్లవాడు అనుకరించే ప్రమాదం లేకపోలేదన్న విషయం మాత్రం ఈ ప్రయోగంతో రుజువైపోయింది. అందుకే ఈ ప్రయోగాన్ని చేసి 50 ఏళ్లు దాటిపోతున్నా, ఇప్పటికీ మానసిక శాస్త్రవేత్తలు దీని గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఈ ప్రయోగం ఆధారంగా తరువాత కాలంలో మరెన్నో పరిశోధనలు సాగాయి.

- నిర్జర.