బీజేపీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం దానిపైనే...
Published on: Fri Sep 17, 2021 3:03PM
కేసీఆర్‌పై కమలనాథులు కాంప్రమైజ్ కాకుండా పోరాడుతున్నారు. తగ్గేదేలే అంటూ కదనోత్సాహంతో ముందుకు కదులుతున్నారు. సెప్టెంబర్ 17.. విమోచన దినోత్సవాలను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సభ నిర్వహించి ఉత్సాహం రెట్టింపు చేస్తున్నారు. ఇక, బండి సంజయ్.. ప్రజా సంగ్రామ యాత్రతో బీజేపీ దూకుడు మామూలుగా లేదు. ఇదే జోష్‌తో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని కమలనాథులు ఆరాటపడుతున్నారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు తొలి సంతకం చేస్తామని ప్రకటించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకుండా కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రభుత్వాలు అన్యాయం చేశాయని కిషన్ రెడ్డి విమర్శించారు. రజాకార్ల నేత కాశిం రజ్వీ పెట్టిన పార్టీ ఎంఐఎం అని, అలాంటి పార్టీకి కేసీఆర్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
మజ్లిస్ కనుసైగలో కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు పనిచేస్తున్నాయని కిషన్‌రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ తన తప్పును తెలుసుకొని..అమరుల ఆత్మకు శాంతి చేకూర్చాలన్నారు. కేసీఆర్, ఒవైసీ కుటుంబాలు తెలంగాణ ప్రజలను తమకి బానిసలుగా ఉండాలని కోరుకుంటున్నాయన్నారు. కుహనా లౌకిక వాదులకి, ఓటు బ్యాంకు రాజకీయాలకు బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ వైఖరి, మజ్లిస్ దౌర్జన్యాన్ని ప్రజలు ఖండించాలని కిషన్ రెడ్డి పిలుపు ఇచ్చారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ముషీరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ జాతీయ జెండా ఎగురవేశారు. మజ్లిస్ మెప్పుకోసమే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని లక్ష్మణ్ మండిపడ్డారు.


