టీ ఉద్యోగుల బెదిరింపు సెక్షన్

 

 

 

తెలంగాణ వస్తుందన్న కలలు మెల్లమెల్లగా కరిగిపోతూ వుండటంతో విభజనవాదులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. గొడవ పడి అయినా, దొమ్మీ చేసి అయినా సీమాంధ్రుల మీద ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్టున్నారు. సీమాంధ్రుల మీద తొలుత మాటల దాడి చేసి భయభ్రాంతులకు గురిచేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రణాళికను అసెంబ్లీ స్థాయి నుంచి గల్లీ స్థాయి వరకూ విజయవంతంగా అమలు చేసే ఉద్దేశంలో కృతనిశ్చయులై వున్నారు.

 

అసెంబ్లీలో టీ బిల్లుపై చర్చ జరిగే చివరిరోజున తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు సృష్టించిన రాద్ధాంతం చరిత్ర ఎన్నటికీ మరచిపోలేదు. ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన, జరుగుతున్న పరిణామాలు తెలంగాణ ప్రజలు కూడా హర్షించే విధంగా లేవు. అన్నదమ్ముల మాదిరిగా విడిపోదామంటూనే సీమాంధ్రుల పట్ల ఆగర్భ శత్రువుల్లా వ్యవహరిస్తున్న విభజనవాదుల తీరు ఎంతోమందికి ఆవేదన కలిగిస్తోంది. అసెంబ్లీలో సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు తమపై భౌతిక దాడులు జరిగే అవకాశం వుందని, తమకి రక్షణ కల్పించాలని స్పీకర్‌కి మొర పెట్టుకున్నారంటే పరిస్థితి  ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు.



ఒక్క అసెంబ్లీలో మాత్రమే కాదు... అన్ని రంగాల్లోనే ఇలాంటి ఘర్షణ పూరిత వాతావరణాన్ని సృష్టించడానికి విభజనవాదులు ప్రయత్నిస్తున్నారు. సచివాలయంలో ఉద్యోగుల హౌసింగ్ సొసైటీకి సంబంధించి జరుగుతున్న సమావేశంలో విభజనవాదులు లేనిపోని రాద్ధాంతం సృష్టించి పోలీసు కేసుల వరకూ వెళ్ళారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడిన మాటలు భవిష్యత్తులో నిజంగానే తెలంగాణ వస్తే హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజల పరిస్థితి ఎలా వుంటుందన్నదానికి అద్దం పట్టేలా వున్నాయి.



ఓ తెలంగాణ ఉద్యోగ సంఘం నాయకుడు మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాసై, రాష్ట్రపతి సంతకం అయ్యే వరకూ వేచి చూస్తాం. ఆ తర్వాత సీమాంధ్రులకు పట్టపగలే చుక్కలు చూపిస్తాం అని వ్యాఖ్యానించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా బతికి వుండగానే ఇలాంటి బెదిరింపు సెక్షన్‌కి పాల్పడుతున్న విభజనవాదులు పొరపాటునో, గ్రహపాటునో రాష్ట్ర విభజన జరిగితే ఎంతకు తెగిస్తారన్నది తలచుకోవడానికి భయం వేసేలా వుంది. ఇలాంటి విపరీత ధోరణులను అరికట్టాల్సిన బాధ్యత అందరిమీదా వుంది.