కేసీఆర్‌‌పై "ఆంగ్ల భజన"కు సర్వం సిద్ధం ..!

మీడియా..అను నిత్యం ప్రజా సమస్యలపై పోరాడేందుకు..వాస్తవాల్ని వెలుగులోకి తెచ్చేందుకు..జనాన్ని చైతన్య పరిచేందుకు ఆనాడు మీడియా సంస్థల్ని ప్రారంభించేవారు. స్వాతంత్ర్యోద్యమంలో దేశభక్తిని పెంపొందించడంలో మీడియా పాత్రను ఎవరూ మరిచిపోలేరు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాకా కూడా ఎన్నో పత్రికలు, వార్తాసంస్థలు దేశ పునర్నిర్మాణంలో తమ వంతు పాత్రను పోషించాయి. కాని ఇప్పటి తరం నాయకులు తీరు వేరే..వీరి గురించి నలుగురికి తెలియాలి..నలుగురు తమ గురించి గొప్పగా చెప్పుకోవాలి. అలాగని విమర్శలను సహించలేరు. అందుకే సొంత పత్రికలు, ఛానెళ్లు పెట్టుకుంటున్నారు. తెలుగునాట ఈ సంస్కృతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. కులానికో పేపర్, పార్టీకో ఛానెల్ ఇంకేముంది ఎవడి డబ్బా వాడిదే. కొన్ని తెలుగు పత్రికలతో పాటు, కొన్ని ఛానెళ్లు కూడా వివిధ పార్టీల నాయకుల చేతుల్లో ఉన్నాయి.

 

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి "టీ న్యూస్" ఛానెల్‌ని ప్రారంభించారు. అది సక్సెస్ కావడంతో వెంటనే "నమస్తే తెలంగాణ" పత్రికను ప్రారంభించారు. అవి రెండూ కూడా కేసీఆర్‌ను, కేసీఆర్‌ పాలనను ఎలా ఆకాశానికి ఎత్తుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తన గురించి తెలుగు రాష్ట్రాల్లోనే తెలిస్తే సరిపోదని..జాతీయ స్థాయిలో తన పేరు బాగా వినిపించాలని ఊవ్విళ్లూరుతున్నారు కేసీఆర్ . తాను తెలంగాణను అభివృద్ధి చేస్తున్న తీరు.. కమిట్‌మెంట్‌ను జాతీయ స్థాయిలో అందరి నోట నానేలా చేయడానికి కేసీఆర్ త్వరలో "తెలంగాణ టుడే" పేరుతో ఆంగ్ల దినపత్రికను ప్రారంభించబోతున్నట్టు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. ఇప్పటికే దీనికి ఎడిటర్ నియామకం జరగ్గా, మిగిలిన సిబ్బంది అన్వేషణలో ఉన్నట్లు సమాచారం. సో..త్వరలో ఇంగ్లీషులోనూ కేసీఆర్‌కు జోరుగా భజన సాగుతుందన్నమాట.