తెలంగాణ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్ధులకు కొత్త టెన్షన్
Published on: Mon Mar 13, 2017 1:17PM

తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారుల చేసిన తప్పు.... అభ్యర్ధుల చావుకొచ్చింది. తప్పు అధికారులు చేసినా.... శిక్ష మాత్రం అభ్యర్ధులకు పడింది. ఈనెల 19న రీపోలింగ్ జరగనుండటంతో అభ్యర్ధులు నానా తంటాలు పడుతున్నారు. మొన్న జరిగిన పోలింగ్‌కే నానా తంటాలుపడి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటే.... తీరా పోలింగ్ ముగిశాక ఫొటో తారుమారుతో పోలింగ్‌ను రద్దు చేయడం, మళ్లీ పోలింగ్ నిర్వహించనుండటంతో ఖర్చు భారీగా పెరిగిపోతోందని అభ్యర్ధులు లబోదిబోమంటున్నారు. గెలుపు సంగతి పక్కన పెడితే మరో వారం రోజుల పాటు ఖర్చు భరించాల్సి ఉండడంతో అభ్యర్ధులందరూ తలలు పట్టుకుంటున్నారు.
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత ఖర్చు చేయాలనే దానిపై నిబంధన లేకపోవడంతో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు భారీగానే ఖర్చు పెట్టారు. ఓటర్లకు విలువైన గిఫ్టులను ఇచ్చుకున్నారు. ఇలా ప్రధాన పార్టీల అభ్యర్థులందరికీ ఖర్చు తడిసి మోపెడైంది. అయితే మొన్న పోలింగ్ స్టేషన్ కు వచ్చి ఓటు వేసిన వారంతా 19న మళ్లీ వచ్చి ఓటు వేస్తారా? అనే భయం అభ్యర్థులకు పట్టుకుంది. దాంతో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.


