TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సరికొత్త పదవి: తెలంగాణ ఆస్థాన వాస్తు పండితుడు

Published on: Mon Oct 6, 2014 7:17PM

 

తెలంగాణ రాష్ట్రంలో ఒక సరికొత్త పదవి త్వరలో సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సరికొత్త పదవి పేరు ‘తెలంగాణ ఆస్థాన వాస్తు పండితుడు’. తెలంగాణ ముఖ్యంమంత్రి కేసీఆర్‌కి వాస్తుకు సంబంధించిన అమూల్యమైన సూచనలను సుద్దాల సుధాకర్ తేజ అనే వాస్తు పండితుడు ఇస్తూ వున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అధికార నివాసానికి సంబంధించిన వాస్తు సూచనలు ఈయనే ఇచ్చారు. ఈయన మీద, ఈయన చెప్పే వాస్తు సూత్రాల మీద కేసీఆర్‌కి మాంఛి గురి వున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఇప్పటికే నిర్మాణం పూర్తయిన భవంతులు, నిర్మాణంలో వున్న భవంతులు.... వీటన్నిటి వాస్తు బాగోగులు చూసే బాధ్యతను ప్రభుత్వం సుద్దాల సుధాకర్ తేజకు అప్పగించినట్టు సమాచారం. ఆయన కూడా ఎంతో శ్రద్ధగా వాస్తు పండితుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కోసం ఎంతో శ్రమిస్తున్న సుద్దాల సుధాకర్ తేజకు ‘తెలంగాణ ఆస్థాన వాస్తు పండితుడు’ అనే పోస్టు ఇచ్చేస్తే ఓ పని అయిపోతుందన్న ఆలోచన ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా కూడా సుద్దాల సుధాకర్ తేజను తెలంగాణ ఆస్థాన వాస్తు పండితుడిగా నియమించాలన్న ఆసక్తితో వున్నట్టు తెలుస్తోంది. సుధాకర్ తేజ అంటే సీఎం కేసీఆర్‌కి కూడా ఎంతో గురి వుంది కాబట్టి త్వరలో తెలంగాణ ఆస్థాన వాస్తు పండితుడి పోస్టు సృష్టించి, ఆ పోస్టులో సుద్దాల సుధాకర తేజను కూర్చోబెట్టే అవకాశం వుందని తెలుస్తోంది. ఇంతకీ ఈ సుద్దాల సుధాకర్ తేజ మరెవరో కాదు... పాటల రచయిత సుద్దాల అశోక్‌తేజకు స్వయానా తమ్ముడు. అలాగే ఈ సుద్దాల సుధాకర్ తేజకు వాస్తులో పాఠాలు చెప్పిన గురువుగారు మరెవరో కాదు.. రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రముఖ వాస్తు పండితుడు గౌరు తిరుపతి రెడ్డి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గురువుగారి దగ్గర శిష్యరికం చేయడం సుధాకర్ తేజకు పదవి రావడానికి అడ్డంకి కాకపోవచ్చేమో.