'విభజన'లో ఎవరి కుట్ర ఎంత?

 

 

 

"సత్యం నావద్ద చాలా ఉంది, చెప్పులు తేరా మగడా! ఇటే నిప్పుల్లో దూకేస్తాను'' అన్నాదట ఒకావిడ వెనకటికి. అలాగే, కొలదిరోజుల నాడు, అంటే చెడిపోయిన కాంగ్రెస్ అధిష్ఠానం, సోనియాగాంధీ తెలుగుజాతిపైన కత్తికట్టి మరీ కసికొద్దీ దేశంలో రెండవ పెద్ద భాషా రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ను నిలువునా చీల్చుతూ కుట్ర ద్వారా ఆగమేఘాల మీద కేంద్ర మంత్రివర్గంతో రాష్ట్ర విభజనకు అడ్డగోలుగా నిర్ణయించింది. అంతకుముందు పదవీ ప్రయోజనాల కోసం వేర్పాటు ఉద్యమాన్ని తెలంగాణలో తిష్ఠవేసిన కోస్తాంధ్ర "బొబ్బిలిదొర'' కె.సి.ఆర్. ప్రారంభించినవాడు. కాగా, ఇంతకాలంగా (గత ఐదారేళ్ళుగా) ఆ స్వార్థపూరిత బాటలోనే కొనసాగుతూ అబద్ద ప్రచారాల ద్వారా, తెలుగుప్రజల మధ్య విద్వేష భావాలు రెచ్చగొట్టి భ్రమలద్వారా కొన్ని వందలమంది యువతను ఆత్మహత్యల వైపు ప్రేరేపించిన ఈ 'పెద్దమనిషి' విభజనకు తలొగ్గిన కేంద్రమంత్రివర్గం అందుకు ఆమోదముద్ర వేసిన తరువాత "టీ.వి.-9' చర్చలో పాల్గొంటూ ఒక 'బ్రహ్మసత్యాన్ని' దాచుకోనలేక బయటికి ప్రకటించేశాడు! ఎదుటిపక్షం వారి ప్రశ్నలకు సమాధానంగా కె.సి.ఆర్. "మన అందరి పాట్లూ ఓట్లూ, సీట్ల కోసమేగదా'' అని చాటాడు! ఈ ప్రకటన ద్వారా కృత్రిమంగా, అశాస్త్రీయంగా, అసంపూర్ణ రాజ్యాంగ ప్రక్రియ ద్వారా, రాష్ట్రంలోని ఎనిమిదిన్నర కోట్లమంది తెలుగువారి నిశ్చితాభిప్రాయంతో జనవాక్య సేకరణతో నిమిత్తం లేకుండా గుప్పిడు నాయకులతో "గుడిపూడి జంగాల'' గుసగుసలు జరిపి కేవలం ఎన్నికలలో రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్ర విభజనకు "టి.వీ.-9'' చర్చ సందర్భంగా బయటపెట్టక తప్పలేదు! అంతకు కొన్నిరోజుల క్రితం - 'విభజన' కుట్రలో అవసానదశకు చేరిన కేంద్రమంత్రివర్గం 'తాతాచార్యుల ముద్ర'వేయకముండు - మంత్రి జైపాల్ రెడ్డి కూడా ఆణిముత్యంలాంటి ఒక ప్రకటన చేశారు : "మేము తప్పులు చేశాం, అబద్ధాలూ ఆడాము'' అన్న మేలుకొలుపులాంటి ఒప్పుకోలు! కాని ఆ "తప్పులేవో'', ఆ "అబద్ధాలు'' ఏవో ఆయన ఆరోజుకీ, ఈ రోజుకీ వెల్లడించనే లేదు.

 

 

"అయితే ఇంతకూ, కెసిఆర్ చెప్పిన "మన అందరి పాట్లూ ఓట్లు, సీట్లకోసమే'' అయితే ఆ పాట్లు ఏవో ఉమ్మడి శ్రమ ఫలితమైన విశాలాంధ్రలోనే పడొచ్చుగదా? మరి బంగారం లాంటి రాష్ట్రాన్ని తెలుగుప్రజల మధ్యనే విద్వేషాలు పెంచడంద్వారా విభజించుకోవలసిన అవసరం ఎందుకొచ్చింది? ఒకవేళ ఉమ్మడి రాష్ట్రం సాధిస్తున్న 'ప్రగతి' మార్గంలో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయనుకుంటే అవి ఎందుకు తలెత్తుతున్నాయో ఆలోచించుకుని పరిష్కారాలు కనుగోనవలసిన అవసరాన్ని గుర్తించాలి గదా? "ఓట్లు, సీట్లు'' పదవుల కోసమే ఒక్కజాతిగా ఉన్న ప్రజలను, రాష్ట్రాలను ఎక్కడికక్కడ చీల్చి ఛిద్రం చేయడానికి పాలకపక్షాలు సిద్ధమైనప్పుడు, ఫెడరల్ వ్యవస్థ ప్రయోజనాలనూ తద్వారా జాతీయ సమైక్యతనూ, సమగ్రతనూ ఎలా పరిరక్షించడం సాధ్యమో ఈ విభజనవాదులు, వారి అవకాశవాద నాయకత్వం వివరించగలరా? వాళ్ళు ప్రాంతాల మధ్య అసమానతల గురించి పెడుతున్న "గావుకేకల''కు పరిష్కారం లేదా ఒకే ప్రాంతంలోని వివిధ మండలాల మధ్య లేదా స్థానిక ప్రదేశాల మధ్య అసమానతల నిర్మూలన అనేది గత 65 ఏళ్ళలోనూ దేశవ్యాప్తంగా సర్వరంగాల అల్లకుపోయిన పెట్టుబడిదారీ-భూస్వామ్య లేదా అర్థభూస్వామ్య వర్గ వ్యవస్థలో, ఆ వర్గ సమాజంలో సాధ్యపడుతుందన్న విశ్వాసంతో ఆంధ్రప్రదేశ్ లాంటి భాషాప్రయుక్త రాష్ట్రాన్ని బదాబాదాలు చేయడానికి సిద్ధంయ్యారా? అసలు మనం ఉంటున్న, కుందుతున్న ఈ వర్గవ్యవస్థ గురించిన ఒక అవగాహనా, స్పృహా, పాడూ ఈ వేర్పాటువాదుల్లో గానీ ఉందా? ఉంటే, శ్రీకృష్ణ కమిటీగానీ, అంతకుముందు రాష్ట్రాల తొల్లింటి పునర్వ్యవస్థీకరణ కమీషన్ గానీ సమైక్య రాష్ట్రంగా తెలుగుజాతి ఉంటేనే శ్రేయస్కరమని ఎందుకు భావించాల్సివచ్చిందో కేవలం పదవీకాంక్షాపరులయిన వీళ్ళకు ప్రాథమిక జ్ఞానమైనా ఉందా? "మా ప్రాంతం నాయకులుసన్నాసులు'' అని శ్రీకృష్ణకమిటీ ముందు సిగ్గువిడిచి అవమానకరంగా ప్రేలాపించి వచ్చిన 'గుప్పిడు' ప్రాంతీయ వేర్పాటువాదులకు అవగాహనపరంగానూ, జ్ఞానపరంగానూ ఉన్న సత్తా ఏపాటిది? ఆ సత్తా లేదుగనుకనే "అందరి పాట్లూ వోట్లు, సీట్లకోసమే గదా'' అని కాంగ్రెస్ టి.ఆర్.ఎస్. నాయకులు బాహాటంగా మీడియాచర్చలో బయటపడాల్సి వచ్చింది!




అయితే తెలుగుజాతికి జరగవలసిన నష్టం కాస్తా జరిగిపోతోంది! "దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే''నన్నది మంచిమాట. కాని ఒకే జాతిగా ఉన్న ప్రజల్ని బలవంతంగా చీల్చడానికి సహితం పదవుల రంధిలో ఉన్న లజ్జాభిమానాలు లేని 'పెద్దలు' కాల్దువ్వడం దుస్సాహమైన పని! ఈ క్షణాన కొన్ని పార్టీలలో జరుగుతున్నా ఓ ప్రత్యేక 'యజ్ఞం' - ఎవడికి వాడు నాయకుడి హోదాలో ఈ 'విభజన' నా వల్లనే సాధ్యమైందని అంటే, కాదు, కాదు నా వల్లను మాత్రమే తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతోంద'ని మరొకడు జెండా ఎత్తడం! ఈ పోటాపోటీలో టి.ఆర్.ఎస్.(కె.సి.ఆర్.), కాంగ్రెస్, 'తెలుగుదేశం', బి.జెపీ.లు  ముందున్నాయి! విభజనకు "ఇండియా దేశీయ సొల్యూషన్'' మాని ఈసారి "ఇటాలియన్ విదేశీ పరిష్కారం'' ముందుకు రావటంతో గుడులూ, గోపురాలూ కూడా నిసిగ్గుగా ఒక ప్రాంతంలో వెలవడం మరొక వెర్రిబాగుల విశేషంగా మారింది; అంతేగాదు, కొన్ని మాసాల క్రితమే ఢిల్లీలో నెలరోజులపాటు కెసిఆర్ ను కాంగ్రెస్ "కట్టుగొయ్య''కు కట్టేసిపడేసిన అధిష్ఠానం అతని స్థానిక పార్టీని కాంగ్రెస్ రథచక్రపు ఇరుసులో చాకచక్యంతో పడేయడంతో అతను టి.ఆర్.ఎస్.ను 'కాంగ్రెస్ గంగ'లో కలపడానికి హామీపడి వచ్చాడు. ఆ తర్వాతి రాజకీయమంతా ముసుగులో మాత్రమే గుద్దులాటగా మారి, కొన్నాళ్ళు నాటకీయంగా మాత్రం అతను టి.ఆర్.ఎస్.ను అతడు కాంగ్రెస్ కు దూరంగా ఓ 'స్వతంత్ర'శక్తిగా అట్టిపెట్టినట్టు 'బిల్డప్' యిచ్చాడని జనాలకు తెలిసిపోయింది!




ఈలోగా కాంగ్రెస్, మధ్యప్రదేశ్ ను రెండుసార్లుగా బిజెపికి పళ్లెరంలో పెట్టి అందించి ఇప్పుడు మూడోసారి కూడా బిజెపికే ధారాదత్తం చేయడానికి సిద్ధమై పంజరంలో చిక్కుకున్న దిగ్విజయ్ సింగ్ టి.ఆర్.ఎస్. నాయకుడితో అహోరాత్రులు సంప్రతింపులలోనే ఉన్నాడని మరచిపోరాదు! ఈ గుంపు చింపులలోనూ తడికె రాయబారాల్లోనూ దాగిన అసలు రహస్యం - కాంగ్రెస్ లో నీ పార్టీని కలిపేస్తే "తెలంగాణా యిస్తా''మని కె.సి.ఆర్.ను దువ్వడమూ, 'కాదు నీవు ముందు ఏదో రూపంలో రాష్ట్రాన్ని విడగొట్టేసి తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తే ఎలాగూ కలవాలనుకున్నాం కాబట్టి కాంగ్రెస్ లో టి.ఆర్.ఎస్.ను కలిపేసి'' తానూ చేతులు దులుపుకుంటానని కాంగ్రెస్ కు చాల విధేయుడై ఉండటానికి సిద్ధంగా ఉన్నానని కెసిఆర్ హామీ పడటమూ ప్రజలకు తెలిసిపోయింది. అయితే ఈలోగా కెసిఆర్ పరిణామం ఎటుపోయి ఎటొచ్చినా మంచిదనుకుని సమాంతరంగా కాంగెస్ కు తెలియకుండా బిజెపితో కూడా రహస్యంగా సంప్రతింపులు జరుపుతూ వచ్చాడు! కనుకనే "సామాజిక తెలంగాణా సంయుక్త కార్యాచరణ సంఘం'' చైర్మన్ గాలి వినోద్ కుమార్ కూడా కెసిఆర్ అంతర్గత నాటకాన్ని కనిపెడుతూ వచ్చి, ఒక హెచ్చరిక కూడా చేశాడు : "కెసిఆర్ బిజెపితో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకోవడం వల్లనే కేంద్రం కెసిఆర్ కు కళ్ళెం వేసేందుకు 'రాయల తెలంగాణా' పేరిట ప్రకటన విడుదల చేయడం గమనార్హం!'' తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే కాంగ్రెస్ లో టి.ఆర్.ఎస్.ను కలిపేస్తానని మాట యిచ్చిన కెసిఆర్ తర్వాత మాట మార్చడం వల్లనే కేంద్రం "రాయల తెలంగాణా'' ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని వినోద్ కుమార్ బహిర్గతం చేశాడని వినోద్ కుమార్ చెప్పాడు! కాని ఇప్పుడు 'విభజన'కు కేంద్ర కాంగ్రెస్ మంత్రివర్గం ఆమోదించినందున రాష్ట్రంలో ఒక ప్రాంతంలో సంబరాలు జరుగుతూ, మరొక ప్రాంతంలో సమ్మెలు, బంద్ లూ, తీవ్ర నిరసనలు, సోనియా, రాహుల్ ల చిత్రాలు జనం తగలబెడుతున్నారు' సమ్మెలకు దిగుతున్నారు. కాగా సోనియా జన్మదినమైన "డిసెంబర్ 9''నాడు ఒకరు బాణాసంచాలు కాలవడానికి సిద్ధమవ్వగా, మరొక ప్రాంతంవారు సోనియా బొమ్మలు నిర్విరామంగా తగలబెడుతున్నారు! ఆ వరసలోనే "ఇటాలియన్ తల్లి''నే 'తెలుగుమాట' అనుకుని, నిరంకుశ నైజాము సమాధివద్ద ఓట్ల కోసం ఎంతగా కెసిఆర్ సాగిలపద్దాడో అంతగానూ సోనియాకూ మొక్కాడు! "ఇదే తెలుగుదనం, ఇదే తెలంగాణా తల్లి' అనుకుందామన్నాడు.


కాని "డిసెంబర్ 9'' ఒకరి జన్మదినోత్సవదినం కాగా, మరొకరికి తెలుగుప్రజలకు ఏకకాలంలో అదే "విద్రోహదినం'' కాబోతున్నది! ఏ సమస్యనూ కూలంకుషంగా పరిష్కరించలేని సంక్షోభంలోకి కాంగ్రెస్ జారుకుని, మరిన్ని సమస్యలను తెలుగువారి మెడకు చుట్టబోతోంది! పైగా ప్రాజెక్టుల గురించి, సేద్యపునీతి సౌకర్యలందించే కృష్ణ-గోదావరులనుంచి అందవలసినంతగా నీరు అందేటట్లు చూస్తామని ఇప్పుడు చెబుతున్న కేంద్రం రేపు వూడిపోయిన తర్వాత ఈ హామీలను నెరవేర్చేనాధుడంటూ ఉండడుగాక ఉండదు. గాలిలో దీపంగానూ, గాలి కబుర్లగానూ మిగిలిపోతాయి! మన కాలంలోనే కాంగ్రెస్, బిజెపి పాలనలలో ఇలాంటి వింతలు చూశాం. కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ కూడా ఒకరి పథకాలను మరొకరు, ఒకరి హామీలను మరొకరూ తుంగలో తొక్కి, ప్రజలను ఇబ్బందులపాలు చేయడమూ చూశాం. అలాగే ఇటీవల కాలం తెలుగుదేశం, కాంగ్రెస్ పాలనలలో కూడా ఇలాంటి తమాషాలు, పథకాలు తారుమారు కావడాలు చూస్తున్నాం! ఈ పరస్పర హామీలను వాటి తర్వాత వచ్చే పాలకులు గౌరవించి, నేరవేర్చాలన్న [ప్రజా వ్యతిరేక పథకం కాకుండా ఉంటే] మాండేట్ కు రాజ్యాంగ నిబంధనలలో ఒక ధర్మసూత్రంగా చట్టబద్ధత కల్గించాలి!


 

కాని, పాలకులు కల్లుతాగిన కోతుల్లా వ్యవహరించినంత కాలం ఈ నైతిక పరిస్థితిని చూడలేము! "లాభం లేనిదే వ్యాపారి వరదనుపోడు'' అన్న సామెత ప్రకారం పెట్టుబడిదారీ - భూస్వామ్య ధనికవర్గ వ్యవస్థ దేశంలో కొనసాగినంత కాలం, తెలుగుజాతిని విడగొట్టాలన్న స్వార్థపూరిత ఆకాంక్షతో తలపెట్టిన కృత్రిమ విభజనవల్ల కూడా రెండుప్రాంతాల ప్రజలకు, ముఖ్యంగా అసంఖ్యాకంగా ఉన్న బహుజన, బడుగువర్గాల ప్రజలకు మేలు జరుగదు సరిగదా కీడు మాత్రమే జరుగుతుంది! ఆ ఒనగూడే మేలూ, మంచీ మాత్రం సంపన్న, మోతుబరి వర్గాలకు మాత్రమే యథాతధంగా అమరుతూవుంటాయి! నేటి దోపిడీవ్యవస్థ రద్దు కానంతకాలం రేపటి సత్యం కూడానని మరచిపోరాదు! ఎందుకంటే, మన తెలంగాణలో తిరిగి రాబోతున్నది కూడా - దొరల, ఇతర భూస్వామ్యవర్గాలదేగాని, దళితులదీ, కష్టజీవులదీ కాదు, కాబోదు! దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తాననేవాడు, ఆ దళితుడినుంచి ఎలా ప్రయోజనం పొందాలో చూస్తాడు. ఆ క్రమంలో దళితుడ్నీ అవినీతిలోకి దించగలడు!