పంద్రాగస్టు: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Published on: Thu Aug 14, 2014 10:27AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటి స్వాతంత్ర్య దినోత్సవాన్ని గోల్కొండ కోట మీద నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. గోల్కొండ కోటను ఇప్పటికే సర్వాంగ సుందరంగా అలంకరించారు. భద్రతా బలగాలు ఇప్పటికే గోల్కొండ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఇదిలా వుంటే, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నట్టు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం నాడు సాయుధ బలగాలు రిహార్సల్ చేశాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మూడు రూట్లలో గోల్కొండ కోటకు వివిఐపిలు, విఐపిలను అనుమతించేందుకు వీలుగా ప్రత్యేకంగా పాస్‌లను జారీ చేసి, వారి వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాలను కూడా కేటాయించినట్లు మహేందర్‌రెడ్డి వివరించారు. పంద్రాగస్టు రోజున ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు హైదరాబాద్ నగరంలో, గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు వుంటాయని ఆయన తెలిపారు.


