తెలంగాణ ఆశలు గోవిందా?

 

 

 

కేంద్రం తెలంగాణ ఇచ్చే కార్యక్రమాన్ని ఏదో ఆషామాషీగా చేసిపారేద్దాం.. ఆంధ్రప్రదేశ్‌ని ఈజీగా రెండు ముక్కలు చేసిపారేద్దాం అనుకుని విభజన నిర్ణయాన్ని ప్రకటించింది. నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాతగానీ తాను తేనెతుట్టె మీద రాయితో కొట్టానని అర్థం అర్థంకాలేదు. ఇప్పుడు రాష్ట్రాన్ని కేక్ కోసినట్టు కోయడానికి కత్తి పట్టుకుని రెడీ అయిన మంత్రుల బృందానికి రాష్ట్రాన్ని ఎలా కోయాలో తెలియక ఆ కత్తితోనే బుర్రలు గోక్కుంటున్నారు.

 

 

రాష్ట్ర విభజన విషయంలో ఏ పాయింట్ గురించి ఆలోచించినా దాన్ని ఎలా సాల్వ్ చేయాలో అర్థంకాక టెన్షన్ పడిపోతున్నారు. నెలలు, సంవత్సరాలు ఆలోచించి, ఎంతో కృషి చేస్తే తప్ప సాధ్యం కాని రాష్ట్ర విభజన ప్రక్రియని కట్టె కొట్టె తెచ్చె అన్నట్టు సింపుల్‌గా పూర్తి చేయడం ఎలాగో తెలియక గందరగోళపడిపోతున్నారు. అందుకే మంత్రుల బృందంలోని సభ్యులు ఈ విభజన గోల తమ నెత్తిన అనవసరంగా పడ్డ బరువుగానే భావిస్తున్నారు. బాధ్యత మొత్తం షిండే, జైరామ్ రమేష్ భుజాల మీద పడేసి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్టు అందరూ తప్పించుకు తిరుగుతున్నారు. మంత్రుల బృందం సమావేశానికి డుమ్మా కొట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మంత్రుల బృందం ఎప్పుడు సమావేశమైనా కొన్ని సీట్లు ఖాళీగా కనిపిస్తున్నాయంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.




దోశ పెనం మీద వుందన్నంత ఈజీగా బిల్లు రెడీ అవుతోందని మంత్రుల బృందం సభ్యులు గంభీరంగా చెబుతున్నప్పటికీ, నిజానికి అంత సీను లేదని తెలుస్తోంది. తమకు వీలుకాకుండా పోయిన ఈ తద్దినాన్ని ఎలా పెట్టాలో అర్థంకాక  మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదిలా వుంటే, తెలంగాణ బిల్లు ఎందాకా వచ్చింది సార్ అని బృందంలో కీలక సభ్యుడు జైరామ్ రమేష్‌ని విలేకరులు అడిగితే, ఆయన ‘గోవిందా.. గోవింద’ అనేసి వెళ్ళపోయారట. పాపం లోపల ఎంత మథనపడి వుండకపోతే ఆయన నోట్లోంచి ఆ మాట బయటపడుతుంది? జైరామ్ రమేష్ చేసిన కామెంట్ చూస్తుంటే తెలంగాణ బిల్లు శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశాలు లేవన్నట్టే అనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. శీతాకాల సమావేశాల్లో బిల్లు పార్లమెంటు ముందుకు రాకపోతే ఇక తెలంగాణ పరిస్థితి జైరామ్ రమేష్ చెప్పినట్టు ‘గోవిందా’ అనుకోవడమే అని భావిస్తున్నారు.