TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణకు పరిష్కారం 'నథింగ్' చిదంబరం

Published on: Wed Mar 28, 2012 10:36AM

న్యూఢిల్లీ: తెలంగాణ సమస్యకు పరిష్కారం ఏమీ లేదని కేంద్ర హోంమంత్రి చిదంబరం చెప్పారు. మంగళవారం పార్లమెంటు భవనంలో  ఆయన కొద్దిసేపు మాట్లాడారు. తెలంగాణ అంశంపై రాష్ట్ర అఖిలపక్ష పార్టీలతో రెండో సమావేశం పెండింగ్‌లో ఉంది కదా.. అని ప్రస్తావించగా 'అఖిలపక్ష సమావేశం పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి?' అని చిదంబరం ప్రశ్నించారు. 'రాజకీయ పార్టీలన్నీ నా వద్దకు వచ్చి వారి వైఖరిని చెప్పాలి' అన్నారు. తెలంగాణ ఎంపీలు రెండు రోజులుగా సభను స్తంభింపచేస్తున్నారని, మరోవైపు టీడీపీకి చెందిన సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ, నిరసన తెలుపుతున్నారని చెప్పగా.. 'మరి రాయలసీమ వాళ్లు ఏమీ అడగటం లేదా?' అని ప్రశ్నించారు.

వారు శ్రీకృష్ణ కమిటీలో పేర్కొన్నట్లుగా ప్రత్యేక ప్యాకేజీ కోరుతున్నారని, బుధవారం జంతర్‌మంతర్ వద్ద ధర్నా కూడా చేయబోతున్నారని చెప్పగా.. 'అవునా' అంటూ ఆరా తీశారు. మరి తెలంగాణ సమస్యకు పరిష్కారం ఏమైనా ఉందా? అని ప్రశ్నించగా.. 'నథింగ్' (ఏమీ లేదు) అని చెప్పారు.  కాగా, తెలంగాణ సమస్య వల్ల స్వదేశంలోనే కాక.. ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పరువు పోతోందని సోమవారం తనను కలిసిన మంత్రులు, ఎంపీల బృందంతో చిదంబరం అన్నట్లు తెలిసింది.

కాగా, తెలంగాణ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పార్టీల మధ్య ఏకాభిప్రాయం రావాలని కేంద్ర హోంమంత్రి చిదంబరం చేసిన ప్రకటనపై సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. 'అన్ని పార్టీలు తమ అభిప్రాయాన్ని చెప్పాయి, శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చి ఏడాదిన్నరవుతోంది. ఇంకా నాన్చడమేంటి' అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలోని ఇరుప్రాంతాల నేతల మధ్య సమన్వయం కుదర్చలేని దుస్థితిలో ఉన్న ఆ పార్టీ అధిష్ఠానం ఇతర పార్టీలపై నెపం నెట్టి తప్పించుకోవడం అన్యాయమన్నారు.