తెలంగాణలో పొత్తు.. ఏపీలో చిత్తు...

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎంత చాతుర్యం కలవాడైనప్పటికీ అప్పుడప్పుడు పప్పులో కాలు వేస్తూ వుంటారు. గతంలో ఎన్నోసార్లు ఈ విషయం నిరూపణ అయింది. అప్పట్లో కేసీఆర్‌కి మంత్రి పదవి ఇవ్వకపోవడం తాను చేసిన ఒక పెద్ద తప్పు అని ఈమధ్య చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆ నిర్ణయం తీసుకున్న సమయంలో తాను చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నానని చంద్రబాబు భావించి వుండొచ్చు. కాలం పాఠాలు నేర్పిన తర్వాత తానెంత తప్పు నిర్ణయం తీసుకున్నానో అర్థమవుతూ వుంటుంది. ఇలాంటి సందర్భాలు చంద్రబాబుకే కాదు.. జీవితంలో దాదాపు అందరికీ వస్తాయి. చంద్రబాబు విషయానికి వస్తే, కేసీఆర్‌కి మంత్రి పదవి ఇవ్వకపోవడం ఎంత తప్పు నిర్ణయమో ఇప్పుడు అర్థమైంది. అలాగే గతంలో టీఆర్ఎస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం కూడా ఎంత పెద్ద తప్పు నిర్ణయమో ఆ ఎన్నికల ఫలితాలు వెల్లడి అయిన తర్వాత తెలిసొచ్చింది. ఇప్పుడు తాజాగా తెలంగాణలో టీడీపీ, టీఆర్ఎస్ పొత్తు కుదిరే అవకాశాలు వున్నాయని వార్తలు వస్తున్నాయి. తాజాగా జరుగుతున్న తెలంగాణ టీడీపీ సమావేశాల్లో కూడా ఈ విషయాన్ని చంద్రబాబు ఖండించలేదు. తెలంగాణతో మరో పార్టీతో పొత్తు వుంటుంది. అయితే ఏ పార్టీ అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం అని ఆయన అన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ఇష్టపడటం లేదు.. కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే వుండదు.. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నా ఉపయోగం వుండదు... అలాంటప్పుడు తెలంగాణలో మరో పార్టీతో పొత్తు అంటే టీఆర్ఎస్‌తోనే అని తెలంగాణ టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. నిజంగానే వచ్చే ఎన్నికలలో టీడీపీ, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే అది టీడీపీ భవిష్యత్తులో మరోసారి బాధపడే అంశం అవుతుందా?

 

తెలంగాణలో టీడీపీ, టీఆర్ఎస్ మధ్య ఎన్నికల పొత్తు కుదిరితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి... తెలంగాణలో టీడీపీ మళ్ళీ తలెత్తుకుంటుందా... ఈ రెండు పార్టీల పొత్తు సక్సెస్ అవుతుందా... తెలంగాణలో టీడీపీ అధికారంలో భాగం పంచుకుంటుందా అనే విషయాలను కాసేపు పక్కన వుంచుదాం. తెలంగాణలో టీడీపీ, టీఆర్ఎస్ మధ్య పొత్తు కుదిరిందంటే మాత్రం అది ఏపీలో టీడీపీ మీద ప్రభావం చూపించే ప్రమాదం వుంది. తెలంగాణలో టీఆర్ఎస్‌తో పొత్తు ఏపీలో టీడీపీని చిత్తు చేసే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముక్కలు కావడానికి టీఆర్ఎస్ పార్టీనే ప్రధాన కారణమనే ఆగ్రహం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వుంది. అలాగే టీఆర్ఎస్ నాయకులు ఆంధ్ర ప్రజల్ని తిట్టిన తిట్లు ఎప్పటికీ మరచిపోలేరు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ - టీఆర్ఎస్ మధ్య తెలంగాణలో పొత్తు కుదిరిందంటే అది ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మనసుల మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు వైసీపీ, బీజేపీ పొత్తు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు ఓటర్లు ఆ కూటమి వైపు మళ్ళే అవకాశాలు లేకపోలేదు. అందువల్ల టీఆర్ఎస్‌తో పొత్తు విషయంలో టీడీపీకి ముందు నుయ్యి, వెనుక గొయ్యి లాంటి పరిస్థితి వుంది.