TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

పోలీస్ పహారాలో సాగర్, శ్రీశైలం..  జల జగడంలో ఏం జరగబోతోంది? 

Published on: Wed Jun 30, 2021 2:14PM

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. కృష్ణానది జలాల విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద భద్రతను పెంచారు. నాగార్జున సాగర్ వద్ద భారీగా పోలీసులు మోహరించింది తెలంగాణ సర్కార్. నాగార్జున సాగర్ జలవిద్యుత్, ప్రధాన డ్యామ్ వద్ద ఎస్పీఎఫ్‌తో పాటు అదనంగా ప్రత్యేక భద్రతా దళాలతో భద్రత ఏర్పాటు చేశారు. పులిచింతల వద్ద కూడా సెక్యూరిటీని పెంచింది. కృష్ణా జలాల వినియోగంపై కృష్ణా రివర్ బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసినందున సాగర్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోథల ప్రాజెక్టు పనులపై కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేయగా.. పనులు వెంటనే ఆపాలంటూ బోర్డు ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణకు కౌంటర్ గా  విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తుందని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు కంప్లైంట్ చేసింది. దీంతో శ్రీశైలం పవర్ జనరేషన్ అపాలని తెలంగాణ విద్యుత్ సంస్థలను ఆదేశించింది కేఆర్ఎంబీ.అయినా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తోంది తెలంగాణ సర్కార్. 

శ్రీశైలం, నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రాల్లో వందశాతం విద్యుత్ ఉత్పత్తి చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నాగార్జున సాగర్, పులిచింతల జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి  ప్రారంభమైంది. నాగార్జున సాగర్ పవర్ ప్లాంట్ 815 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో నాగార్జున సాగర్‌లో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తికి జెన్‌కో సన్నాహాలు చేస్తోంది. మరోవైపు రాయలసీమ ప్రాజెక్టు పనులను బుధవారం పరిశీలించాల్సిన కేఆర్ఎంబీ టూర్ వాయిదా పడింది. తమకు ఏపీ నుంచి సహకారం అందడం లేదని ఆరోపించింది. జూలై3న భద్రతా బలగాల సాయంతో ప్రాజెక్టును పరిశీలిస్తామని కేఆర్ఎంబీ కేంద్ర జలవనరుల శాఖకు తెలిపింది. 

కేఆర్ఎంబీ ఆదేశాలను రెండు రాష్ట్రాలు పట్టించుకోకపోవడంతో జల వివాదం ఎటువైపు దారి తీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలోనూ ఓసారి నాగార్జున సాగర్ డ్యాం దగ్గర ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా బలగాలను మోహరించడం టెన్షన్ పుట్టించింది. ఒకానొదక దశలో ఇరు రాష్ట్రాల పోలీసులు బాహాబాహీకి దిగడం కలకలం రేపింది. ఈసారి కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడుతాయోమోనన్న చర్చ జరుగుతోంది.