కిడ్నాపర్లను గుర్తించడానికి ఐదు రోజులా! టెక్నాలజీ  తుస్సేనా! 

శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం.. సాంకేతిక టెక్నాలజీ వినియోగిస్తూ కేసులు చేధించడంలో తెలంగాణ పోలీసులే టాప్.. రాష్ట్రంలో ఎక్కడ చీమ చిట్టుకుమన్నా గుర్తించే పరిజ్ఞానం మన పోలీసుల సొంతం.. ఇవి గత ఐదేండ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న మాటలు.  గొప్పగా చేసుకుంటున్న ప్రచారాలు. గత ఆరేండ్లలో పోలీస్ శాఖకు భారీగా నిధులిచ్చామని, హైటెక్ సౌకర్యాలు కల్పించామని, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఆయన చెబుతుంటారు. కాని ఒక్క ఘటన తెలంగాణ పోలీసుల సత్తాకు సవాల్ గా నిలిచింది. మహబూబా బాద్ కిడ్నాప్ కేసు తెలంగాణ పోలీసుల పనితీరును ప్రశ్నించేలా మారింది. తెలంగాణ కాప్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిహసించేలా చేస్తోంది. 

 

మహబూబా బాద్ లో జరిగిన బాలుడి కిడ్నాప్ కేసులో పోలీసుల తీరుపై చాలా ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. హైటెక్ టెక్నాలజీ ఉన్న రోజుల్లోనూ కిడ్నాపర్లను గుర్తించడానికి ఐదు రోజులు తీసుకోవడం ఏంటనే ఆరోపణలు వస్తున్నాయి. అది కూడా కిడ్నాపర్లు డబ్బుల కోసం బాలుడి పేరెంట్స్ తో మాట్లాడుతూనే ఉన్నారు. బాలుడి పేరెంట్స్ చుట్టే  పోలీసులు తిరిగారు. కిడ్నాపర్ల ఫోన్లను పోలీసులు కూడా విన్నారు. అయినా వారెవరో, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో , కిడ్నాపర్లు ఫోన్ మాట్లాడుతున్న లొకేషన్ ఏంటో వెంటనే కనిపెట్టలేకపోయారు. ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తి లొకేషన్ ను మినిట్ టు మినిట్ ట్రేస్ చేసే టెక్నాలజీ ఉన్న ప్రస్తుత సమయంలో ... మహబూబా బాద్  పోలీసులకు కిడ్నాపర్లను గుర్తించడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రజల్లో కూడా ఇవే అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్న గొప్ప టెక్నాలజీ ఎక్కడ పోయిందని వారు ప్రశ్నిస్తున్నారు. 

 

ఆదివారం సాయంత్రం దీక్షిత్ రెడ్డి కనిపించకుండా పోయారు. అదే రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. డబ్బుల కోసం కిడ్నాపర్ సోమవారం బాలుడి పేరెంట్స్ కు 11 సార్లు ఫోన్ చేశారని చెబుతున్నారు. మంగళవారం సైలెంట్ గా ఉన్న అగంతకులు బుధవారం మళ్లీ బాలుడి పేరెంట్స్ తో టచ్ లోకి వచ్చారు. డబ్బులు ఇవ్వాలని, ఇక్కడికి రావాలని, డబ్బును అక్కడ పెట్టి వెళ్లండని ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నారు. అయినా ఐదు రోజులుగా బాలుడి కోసం వెతుకుతున్న పోలీసులు మాత్రం కిడ్నాపర్ల జాడ కనిపెట్టలేకపోయారు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ కాలంలో కూడా కిడ్నాపర్లు ఫోన్ లో మాట్లాడుతున్నా గుర్తించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీక్షిత్ రెడ్డి కేసులో మహబూబా బాద్ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి.

 

అయితే మహబూబా బాద్ ఎస్పీ కోటిరెడ్డి మాత్రం కేసులో తామెక్కడ నిర్లక్ష్యం వహించలేదని చెప్పారు. కిడ్నాపర్ చాలా తెలివిగా వ్యవహరించాడని, తనను ట్రేస్ చేయకుండా ఉండటానికి ఫోన్ వాడలేదని తెలిపారు. బాలుడి పేరెంట్స్ కు ఇంటర్ నెట్ కాల్స్ చేశారని ఎస్పీ వెల్లడించారు. యాప్ ద్వారా ఇంటర్ నెట్ కాల్స్ చేయడం వల్లే కిడ్నాపర్ ను గుర్తించడం వెంటనే సాధ్యం కాలేదన్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ సాయంతో కిడ్నాపర్ వాడిన యాప్ ను గుర్తించి.. అతని మార్గంలోనే యాప్ సాయంతోనే గుర్తించామని చెప్పుకొచ్చారు. కిడ్నాపర్ యాప్ వాడటం వల్లే గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టిందని ఎస్పీ తెలిపారు. అయితే ఎస్పీ ప్రకటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం సాధారణ జనాలే హైటెక్ టెక్నాలజీని  ఉపయోగిస్తూ డిజిటల్ వండర్స్ చేస్తున్నారు. పోలీసుల దగ్గర మరింత అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉంటుంది. అయినా యాప్ ద్వారా మాట్లాడుతున్న కిడ్నాపర్ ను వెంటనే గుర్తించే టెక్నాలజీ లేకపోవడం ఏంటనే విమర్శలు జనాల నుంచి వస్తున్నాయి. టెక్నాలజీ వినియోగంలో  పూర్ గా ఉన్న ఈ పోలీసులనే .. దేశానికే ఆదర్శమని సీఎం కేసీఆర్ చెబుతున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. 

 

మహబూబా బాద్ జిల్లా కేంద్రంలోనే దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ జరిగింది. బాలుడిని బైక్ పై తీసుకుని దర్జాగా వెళ్లాడు కిడ్నాపర్. కాని ఎక్కడా సీసీ టీవీలో అవి రికార్డు కాలేదు. అంటే మహబూబా బాద్ జిల్లా కేంద్రంలో సీసీ కెెమెరాలు కొన్ని ప్రాంతాల్లోనే ఉన్నాయని దీన్ని బట్టి అర్ధమవుతోంది. అందుకే కిడ్నాపర్ విజువల్స్ ఎక్కడా చిక్కలేదని, పట్టణ శివారులోని ఒక ప్రాంతంలోనే అతడి విజువల్ రికార్డైందని తెలుస్తోంది. జిల్లా ఎస్పీ కూడా ఇదే విషయం చెప్పాడు. అయితే జిల్లా కేంద్రంలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు సరిగ్గా లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కెమెరాలు ఎక్కడ అమర్చారనే ప్రశ్నలు వస్తున్నాయి. జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రాామాలు, పల్లెల్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 

 

ఐదేండ్ల క్రితం ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో మిస్సైన బాలుడిని ఇటీవలే అసోంలోని గోలపారాలో గుర్తించి త‌ల్లిదండ్రుల చెంత‌కు చేర్చారు. తెలంగాణ స్టేట్ పోలీసులు అభివృద్ధి చేసిన ఫేస్ రికగ్నిషన్ యాప్ ద‌ర్ప‌న్ ద్వారా ఇది సాకార‌మైందని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. ద‌ర్ప‌న్ ద్వారా తెలంగాణ పోలీసులు బాలుడిని గుర్తించి ఆచూకీని క‌నుగొన్నారని ఆయన తెలిపారు. ఇంతటి టెక్నాలజీ ఉన్న తెలంగాణ పోలీసులు.. ఫోన్ లో మాట్లాడుతున్న కిడ్నాపర్లను గుర్తించడానికి ఐదు రోజులు తీసుకోవడం చర్చనీయాశంగా మారింది. మొత్తంగా మహబూబా బాద్ ఘటన తెలంగాణ పోలీసుల ప్రతిష్టకు మచ్చగా, సీఎం కేసీఆర్ గొప్పగా చేసుకుంటున్న ప్రచారానికి గండి కొట్టేదిగా మారిందనే చర్చే జనాల్లో ఎక్కువగా జరుగుతోంది.