TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పోలీస్ సిబ్బందికి పుట్టిన రోజు...పెళ్లి రోజున ప్రత్యేక సెలవు

Published on: Mon Apr 27, 2026 8:11PM

 

పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పని–జీవిత సమతుల్యతను పెంపొందించడమే లక్ష్యంగా, సిబ్బంది పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవం రోజున ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని నిర్ణయించింది.ఈ మేరకు డీజీపీ బి. శివధర్ రెడ్డి సర్క్యులర్ మెమోరాండం జారీ చేశారు. పోలీసింగ్‌లో ఉన్న కఠిన పరిస్థితులు, విధి నిర్వహణలో సిబ్బంది చేస్తున్న త్యాగాలను గుర్తిస్తూ ఈ సంక్షేమ చర్యను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

హోదా తేడా లేకుండా రాష్ట్రంలోని అన్ని పోలీస్ సిబ్బందికి ఈ సౌకర్యం వర్తించనుంది. సాధారణ పరిస్థితుల్లో పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవం సందర్భంగా సెలవు కోరిన అధికారులకు, సిబ్బందికి యూనిట్ అధికారులు తప్పనిసరిగా సెలవు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే సెలవును నిరాకరించవచ్చని పేర్కొన్నారు. సెలవు మంజూరు కోసం కొన్ని షరతులు కూడా విధించారు. సర్వీస్ రిజిస్టర్‌లో నమోదైన వివరాల ఆధారంగా మాత్రమే సెలవు ఇవ్వబడుతుంది. అలాగే సంబంధిత సిబ్బంది నుంచి లిఖితపూర్వక అభ్యర్థన వచ్చినప్పుడే మంజూరు చేయాలని తెలిపారు.

పోలీస్ సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన వ్యక్తిగత సందర్భాలను ఆనందంగా జరుపుకునే అవకాశం కల్పించడం ద్వారా వారి మనోధైర్యం పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీస్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర పోలీస్ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఈ ఆదేశాలు రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పోలీస్ సంక్షేమానికి ఇది మరో ముందడుగుగా భావిస్తున్నారు.