కేసీఆర్ సచివాలయాన్ని కూలుస్తారా..?

ప్రస్తుతం దేశంలోని ముఖ్యమంత్రులందరిలోకి వాస్తు, జ్యోతిష్యం తదితర విషయాలను బాగా నమ్మే వ్యక్తి కేసీఆర్. వాస్తు బాగోలేదని క్యాంప్ ఆఫీస్‌ని వేరేచోట నిర్మించబోతున్నారు..వాస్తు కారణం చూపి సచివాలయాన్ని పడగొట్టబోతున్నారు. అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే సచివాలయంలో భయంకరమైన వాస్తు దోషం ఉందని జ్యోతిష్యులు హెచ్చరించడంతో అటువైపు వెళ్లడానికి భయపడిపోయారు కేసీఆర్. దీంతో సచివాలయాన్ని ఎర్రగడ్డ హృద్రోగ ఆసుపత్రికో లేదా సికింద్రాబాద్‌లోని పోలో గ్రౌండ్స్‌కో మార్చాలని కంకణం కట్టుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాటు స్థల సేకరణ తలనొప్పిగా మారడంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు. "సారీ వాయిదా వేసుకున్నారు".

 

అయితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి తన ఉద్యోగులను తరలిస్తుండటంతో కేసీఆర్‌కు ప్రాణం లేచొచ్చినట్లైంది. ఈ నేపథ్యంలో సచివాలయాన్ని కూల్చివేయడానికి ఇదే సరైన సమయంగా గులాబీ బాస్ భావిస్తున్నారు. ఏ, బీ, సీ బ్లాక్‌లను కూల్చేసి..కొత్తగా, మోడర్న్‌గా ఉన్న డీబ్లాక్‌ను అలానే ఉంచి, వాస్తు ప్రకారం ఎల్‌ షేప్‌లో బిల్డింగ్ కట్టనున్నారట. ఇక ఏపీ గవర్నమెంట్ షిఫ్ట్ అయ్యాక ఖాళీ స్థలాన్ని పక్కాగా వాడుకోవాలనుకుంటున్నారు. మంచిరోజులు రాగానే..ఆగస్టులో ఈ పనులకు ముహూర్తంగా ఎంచుకున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. పనులు ప్రారంభమైనప్పటి నుంచి ఏడాది వ్యవధిలోగా కొత్త భవన సముదాయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది కట్టేంతవరకు పరిపాలనా వ్యవహారాలకు విఘాతం కలగకుండా ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల కార్యకలాపాల నిర్వహణకు తాత్కాలిక విడిదిని అన్వేషించాలని కూడా సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో తాత్కాలిక సచివాలయం కోసం బూర్గుల భవన్, లోయర్ ట్యాంక్ బండ్ లోని ఎక్స్‌పోటెల్, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే దశాబ్ధాలుగా ఎందరో ముఖ్యమంత్రుల కార్యస్థానంగా..సంచలన నిర్ణయాలకు కేంద్రస్థానంగా భాసిల్లిన సచివాలయాన్ని కూల్చివేతపై కొందరు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.