TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లోకేష్ పై ప్రశంసల వర్షం కురిపించిన కవిత.. విషయమేంటి?

Published on: Fri Apr 11, 2025 3:24PM

తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మాట్లాడారు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి పార్టీలలో ఒక పార్టీ నేతలపై పొగడ్తల వర్షం కురిపిస్తూ, మరో పార్టీ అధినేతపై విమర్శలు గుప్పించారు. మామూలుగా అయితే రాష్ట్ర విభజన తరువాత నుంచీ బీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలూ, చర్యలూ పెద్దగా ఏమీ లేకపోయినా.. బీఆర్ఎస్ అధినేత నుంచి ఆ పార్టీ నేతలంతా తెలుగుదేశం అంటే ఉలిక్కి పడుతుంటారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే.. చంద్రబాబుకు 2019 ఎన్నికలలో బిగ్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానని చెప్పుకున్నారు కూడా. అలాగే ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జగన్ హయాంలో చంద్రబాబును స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టు చేసినప్పుడు చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. అసలు కేసీఆర్ అయితే తెలంగాణలో తన రాజకీయప్రయాణం సాఫీగా జరగాలంటే చంద్రబాబును టార్గెట్ చేసి రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ ను సజీవంగా ఉంచడం ఒక్కటే మార్గమని భావిస్తుంటారని పరిశీలకులు చెబుతారు.

అటువంటిది బీఆర్ఎస్ అధినేత కుమార్తె, ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా చంద్రబాబు, లోకేష్ లపై ప్రశంసల వర్షం కురిపించి, అదే సమయంలో జనసేనాని పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించడం రెండు రాష్ట్రాలలోనూ చర్చనీయాంశంగా మారింది.  

అదే విధంగా కవిత చంద్రబాబు, లోకేష్ లను పొగడడం బీఆర్ఎస్ లో కూడా ఆసక్తికర చర్చకు దారి తీసింది.  ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కవిత తన తండ్రి కేసీఆర్ తన ఫేవరెట్ లీడరని చెబుతూనే.. చంద్రబాబు మనోధైర్యం, లోకేష్ మేకోవర్ అద్భుతమని అన్నారు.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు చాలా సిన్సియర్ లీడర్, ఏ సమస్యనైనా, సవాల్ నైనా ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పిన కవిత, ఆయన కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ మేకోవర్ అద్బుతమన్నారు. ప్రజలతో ఆయన మమే కమయ్యే విధానాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. అదే సమయంలో  బీఆర్ఎస్ తో, కేసీఆర్ తో సత్సం బంధాలు కొనసాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ సీరియస్ గా తీసుకోవలసిన నాయకుడు కాదంటూ చులకన చేశారు. పవన్ పై తనకు ఏ మా త్రం గౌరవం లేదని కుండబద్దలు కొట్టేశారు. దీంతో ఉభయ రాష్ట్రాలలోనూ ఇప్పుడు కవిత వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. కూటమి పార్టీలలో ఒక పార్టీ నేతలపై పొగడ్తలు, మరో పార్టీ అధినేతపై విరమ్శల వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.