4 వేల కోట్ల కోసం కక్కుర్తిపడి.. రైతుల మెడకు జగన్ మీటర్ల ఉచ్చు..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ లకు మేలు చేస్తూ.. దేశంలో నయా జమీందారీ వ్యవస్థకు శ్రీకారం చుడుతోందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. వ్యవసాయ బావులకు, బోర్లకు కరెంటు మీటర్లు పెట్టి రైతులను నిండా ముంచాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా లో పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం జ‌గ‌న్‌పై హరీశ్‌ రావు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. విద్యుత్ మీట‌ర్ల విష‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని తప్పుబడుతూ.. 4వేల కోట్లకు ఆశపడిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. మీటర్ల పేరుతో ఆంధ్రా రైతుల మెడకు ఉచ్చు బిగిస్తున్నారని హ‌రీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ‌లో కూడా వ్య‌వ‌సాయ విద్యుత్‌కు మీట‌ర్లు పెడితే.. రూ.2500 కోట్లు ఇస్తామ‌ని కేంద్రం ఆఫ‌ర్ చేసింద‌ని.. అయితే కేసీఆర్ ఈ ఆఫర్ ను తిర‌స్క‌రించారని పేర్కొన్నారు.

 

ఇప్ప‌టికే వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటు చేయాలన్న ఎపి సీఎం జ‌గన్ నిర్ణ‌యంపై అనేక విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసిపికి దోస్త్ ఐన టీఆర్ఎస్ ముఖ్య నేతల నుండి ఇటువంటి వ్యాఖ్యలు రావడం చ‌ర్చ‌నీయాశంగా మా‌రాయి. అంతేకాకుండా ఇప్ప‌టికే కేంద్రానికి మ‌ద్ద‌తిచ్చే విష‌యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. తాజాగా పార్లమెంట్ లో వ్య‌వ‌సాయ బిల్లుల‌ను టీఆర్ఎస్ వ్య‌తిరేకిస్తే.. వైసీపీ సపోర్ట్ చేసింది. మంత్రి హ‌రీష్‌రావు వ్యాఖ్య‌ల‌పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.