TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తప్పులెన్నువారు...

Published on: Mon Mar 23, 2015 1:06PM

 

ఈరోజుల్లో బోడి గుండుకి మొకాలుతో ముడిపెడుతూ మాట్లాడటం వస్తే చాలు రాజకీయాలలో చేరేందుకు ప్రాధమిక అర్హత ఉన్నట్లే భావించవచ్చును. ఈ విషయంలో తెరాస, వైకాపా నేతలకున్న ప్రతిభ మరొకరికి ఉండబోదని చెప్పవచ్చును.

 

అసెంబ్లీలో తనను మాట్లాడేందుకు అనుమతించడం లేదంటూ గంటలు గంటలు ప్రసంగాలు చేసే జగన్మోహన్ రెడ్డి ఆ వంకతో అసెంబ్లీని బహిష్కరించివెళ్ళిపోతే, ప్రతిపక్షం లేకుండానే చంద్రబాబు నాయుడు అసెంబ్లీని నిర్వహించేస్తున్నారంటూ, తెలంగాణా అసెంబ్లీ నుండి 11 మంది తెలంగాణా తెదేపా సభ్యులను బడ్జెట్ సమావేశాల నుండి బహిష్కరించి చేతులు దులుపుకొన్న ఆ రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్ రావు ఆక్షేపించడం విచిత్రం. తెలంగాణాలో నిరంకుశపాలన సాగుతోందని ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి. అదే విధంగా మీడియాపై కూడా ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఆ సంగతి విస్మరించి, చంద్రబాబు నాయుడు నిరంకుశ పాలన సాగిస్తున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించడం మరో విచిత్రం.

 

వైకాపా సభ్యులు వారంతటవారే శాసనసభ సమావేశాలను బహిష్కరించి వెళ్ళిపోయారు. ప్రజల తరపున శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీయవలసిన బాధ్యత కలిగిన ప్రధాన, ఏకైక ప్రతిపక్షం వైకాపా చాలా బాధ్యతారాహిత్యంగా కీలకమయిన బడ్జెట్ సమావేశాలను బహిష్కరించి వెళ్ళిపోతే అందుకు వైకాపాను దాని అధినేత జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం మాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని హరీష్ రావు విమర్శించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

 

ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ని ఖరారు చేసేందుకు శాసనసభ బిజినస్ అడ్వయిజరీ కమిటీ సమావేశమయినప్పుడు, తమ పార్టీ సూచిస్తున్న అంశాలను అజెండాలో చేర్చకపోయినట్లయితే సభలో “అగ్లీ సీన్స్ క్రియేట్’ చేస్తామని వైకాపా ప్రతినిధులు ముందే హెచ్చరించారు. చెప్పినట్లే సభలో అగ్లీ సీన్స్ క్రియేట్ చేసి సభను బహిష్కరించి వెళ్ళిపోయారు. మళ్ళీ సభలో అడుగుపెట్టబోమని శపథం చేయడమే కాకుండా బస్సు యాత్ర చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. అంటే అన్ని ముందుగా అనుకొన్నట్లే ఒక పధకం ప్రకారమే వైకాపా వ్యవహరించిందని స్పష్టం అవుతోంది. ఈవిధంగా వైకాపా ఏదో ఒక రాజకీయ వ్యూహ ప్రకారం సభను బహిష్కరించి బయటకు వెళ్ళిపోతే, కీలకమయిన బడ్జెట్ సమావేశాలను బహిష్కరించి బస్సు యాత్రలు చేయబోతున్న జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించవలసిన మంత్రి హరీష్ రావు చంద్రబాబు నాయుడుని ఎందుకు నిందిస్తున్నారో?

 

తెలంగాణా అసెంబ్లీ నుండి బహిష్కరించబడిన తెదేపా సభ్యులు తమపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసి మళ్ళీ తమను బడ్జెట్ సమావేశాలలో పాల్గొనేందుకు అనుమతించమని కోరుతున్నా వారిని తెలంగాణా ప్రభుత్వం అనుమతించడం లేదు. వారు తమ తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పేందుకు కూడా సంసిద్దత వ్యక్తం చేసారు. అయినా కూడా వారిని సభలోకి అనుమతించడం లేదు. వైకాపా సభ్యులు వారంతట వారుగా సభను బహిష్కరించి వెళ్లిపోతే, తెదేపా తెలంగాణా సభ్యులు తిరిగి సభలోకి రావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నా అనుమతించడం లేదు. చంద్రబాబు నాయుడులో తప్పులెంచుతున్న మంత్రి హరీష్ రావు తన ప్రభుత్వం చేసింది మాత్రం తప్పుగా భావించక పోవడం విచిత్రం. అయినా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి శాసనసభలో అడుగుపెట్టమని ప్రకటించి బస్సు యాత్రలు చేయదలచుకొన్నప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం ఏమి చేయగలరు? స్పీకర్ డా. కోడెల శివప్రసాద్ పై వైకాపా సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చించడానికి సిద్దంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు చెపుతున్నారు. కానీ వారికి సమావేశాలలో పాల్గొనే ఉద్దేశ్యాలు లేవని స్పష్టం చేస్తున్నారు.