TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీఆర్ఎస్ కు మెజార్టీ.. రేవంత్ రెడ్డి సీఎం! సంచలనమేనా..?

Published on: Fri Nov 12, 2021 9:09PM

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేండ్ల గడువు ఉన్నా.. పార్టీల దూకుడుతో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన కేసీఆర్.. ఓట్ల వేటే లక్ష్యంగా కొత్త పథకాలకు ప్లాన్ చేస్తున్నారు. హుజురాబాద్ విజయం ఇచ్చిన బూస్ట్ తో అధికారం దిశగా మరింత దూకుడుగా వెళుతోంది బీజేపీ బండి సంజయ్ టీమ్. ఇక వరుస ఓటములతో కుదేలైనా.. పీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డికి ఇవ్వడంతో కాంగ్రెస్ లో మళ్లీ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వరుస కార్యక్రమాలతో పార్టీ కేడర్ లో జోష్ నింపుతున్నారు రేవంత్ రెడ్డి. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు విజయం ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలతో ప్రజల నాడి తెలుసుకునేందుకు సర్వే సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా  ‘గ్రౌండ్ రిపోర్ట్’ అనే సంస్థ తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. ప్రతి నియోజకవర్గంలో దాదాపు వెయ్యి నుంచి నాలుగు వేల మంది ఓటర్లను ఇంటర్వ్యూలు చేసినట్లు సంస్థ తెలిపింది. ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు సీఎం అభ్యర్థిపై వేర్వేరుగా ప్రశ్నించారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లోని ఓటర్ల నాడిని తెలుసుకొని ‘గ్రౌండ్ రిపోర్ట్’ సర్వే ఫలితాలను వెల్లడించింది. గ్రౌండ్ రిపోర్ట్ సర్వేలో సంచలన ఫలితాలు వచ్చాయి. 

తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరూ అధికారంలోకి వస్తారనే ప్రశ్నకు ఎక్కువ మంది టీఆర్ఎస్ కే ఓటు వేశారు. గ్రౌండ్ రిపోర్టు సర్వే ప్రకారం  అధికార టీఆర్ఎస్ పార్టీకి 65-70 సీట్లు రానున్నాయి.  కాంగ్రెస్‌కు 35-40, బీజేపీ 12-14, ఇతరులు 0-1 గా ఫలితాలు రానున్నాయి. ఈ లెక్క ప్రకారం మళ్లీ అధికారం గులాబీ పార్టీదే. కాని ముఖ్యమంత్రి అభ్యర్థిపై మాత్రం ఫలితాలు మాత్రం వీటికి భిన్నంగా వచ్చాయి. రేవంత్ రెడ్డిని సీఎంగా చూడాలని 44 శాతం మంది ఓట్లు వేసినట్లు సర్వేలో తేలింది. తర్వాత సీఎం కేసీఆర్‌కు 42శాతం, బండి సంజయ్‌కు 6-7 శాతం మంది ఓటు వేశారు. 

పార్టీగా టీఆర్ఎస్ కు మెజార్జీ జనాలు జై కొట్టగా.. వ్యక్తిగతంగా మాత్రం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం ఆసక్తి రేపుతోంది. రేవంత్ రెడ్డి క్రేజీ రోజు రోజుకు పెరిగిపోతుందని సర్వేలో తేలింది. ఎన్నికల నాటికి ఇది మరింత బలపడితే.. కాంగ్రెస్ అనూహ్య ఫలితాలు సాధించవచ్చనే అభిప్రాయం సర్వే సంస్థల నిర్వాహకులతో పాటు రాజకీయ నిపుణుల నుంచి వస్తోంది.