తెలంగాణ హైకోర్టు.. మరింత ముదిరిన వివాదం..

తెలంగాణలో హైకోర్టు వద్ద ఇంకా టెన్షన్ వాతావరణం నెలకొంది.  హైకోర్టులో న్యాయాధికారుల నియామకాలకు సంబంధించి ఆప్షన్ విధానాన్ని నిరసిస్తూ తెలంగాణ తరుపు న్యాయాధికారులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తమకు న్యాయం చేయాలంటూ న్యాయమూర్తులు, లాయర్లు మూడు రోజుల నుండి హైకోర్టు వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఆగ్రహం చెందిన హైకోర్టు.. నిన్న 11 మంది జడ్జిలను సస్పెండ్ చేసింది. అయితే ఇప్పుడు వారి సస్పెన్షన్ ను నిరసిస్తూ ఆందోళనలు చేపడుతున్నారు. దీనిలో భాగంగానే వచ్చే నెల 15 వరకు సామూహిక సెలవులు పెట్టారు.

 

మరోవైపు న్యాయవాదులు చలో హైకోర్టుకు పిలుపునివ్వడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లాయర్లు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో హైకోర్టు వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. న్యాయవాదులను అడ్డుకుంటున్నారు. అంతేకాదు.. మొన్న గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చినట్లుగానే ఈ రోజు కూడా న్యాయాధికారులు ర్యాలీగా వెళ్లి గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.